Sunday, July 29, 2012

సనాతన వైదిక ధర్మం -3

సృష్టి అంతా వేద శబ్దంచే సృజించబడినది

 
వేదం అనేది విజ్ఞాన శాస్త్రం. కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.  మను అనే మహర్షి వేదాన్ని గురించి ఇలా చెప్పాడు.  "వేద శబ్దేభ్య ఏవాతౌ దేవా దీనం చకార సహ"

సహ- ఈ జగత్తుని సృజించినవాడెవడో జగత్ కారణమైనటువంటి వాడొకడున్నాడు. ఈ విషయం అందరూ అగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే "For Every Effect there must be some Cause". మనం ఇప్పుడు చూస్తున్న ఈ జగత్తు అంతటికీ ఒక కారణం అనేది ఉండాల్సిందే. దాన్నే మనం కారణ తత్వం అందాం. ఈ జగత్తులో ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఇవన్నీ ఒకదాని తో ఒకటి ముడి పడి ఉన్నాయి.

ఆ కారణ తత్వం వీటన్నింటినీ నడుపుతుంది. మన పెద్దలు "కారణంతు ధ్యేయః" ఆ కారణాన్ని తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతారు. ఆ తత్వం ఎక్కడో ఒక చోట ఉంటుంది అని చెప్పనవసరం లేదు. ఎందు కంటే మనం చూసే ప్రతి అణువణువు ఎంత క్రమబద్దమై ఉంటుంది కావున అది అంతటా వ్యాపించియే ఉంటుంది. ఇంతటినీ తయారు చేసిన ఆ కారణ తత్వం చాలా శక్తివంతమైనది, అన్నింటినీ నియంత్రించ గలదై ఉండాల్సిందే లేకుంటే దీన్నంతా ఆధీనంలో పెట్టుకోవడం అంత సులువుకాదు.  నియంత్రించడం అనేది పురుష స్వభావం అయితే ఇక దయ, క్షమ, ఓరిమి, జాలి ఇవన్నీ స్త్రీ స్వభావం అని అనుకోవచ్చు. అందుకే ఆయనలోని ఈ నియంత్రించే స్వభావన్ని బట్టి మను అనే మహర్షి "సహ" అంటే అతడు అని వ్యవహరిస్తాడు.

మరి కేవలం నియంత్రించే తత్వమే ఆ జగత్ కారణ తత్వానికి ఉంటే ప్రమాదం కదా, ఎవ్వరూ దాని దరికి చేరటానికి ఇష్ట పడరు. అందుకే ఆ కారణ తత్వం మొత్తం దయచే ఆక్రమించబడి నిరంతరం ఉంటుంది. వేద భాగమైన మంత్ర పుష్పాల్లో ఈ విషయం చెప్పబడి ఉంది.  "నీలతో యదమధ్యస్తాః విధ్యుల్లేఖేవ భాస్వరః" దయా అనే గుణం ఆయనలో ఒక మేఘాన్ని ఆక్రమించిన మెరుపు తీగవలె, ఆ తత్వాన్ని కప్పబడి ఉంటుంది అని తెలుపుతుంది. అయితే దయ అనేది స్త్రీ స్వభావం అవటంచే స్త్రీ రూపంలో భావన చేస్తుంటారు.  అయితే ఈ నియంతృత్వం లేక శాసితృత్వం మరియూ దయ లో ఏ ఒక్కటీ లేక పోతే పని చెయ్యదు. కేవలం శాసితృత్వం ఉన్నా సరిపోదు, కేవలం దయ ఉన్నా సరిపోదు. అందుకే మన పెద్దలు ఇవి రెండు వేరువేరుగా ఉండవయా, దయ కల్గిన నియంత్రణ ఉన్న వాడే ఈ జగత్ కారణ తత్వం అని చెబుతారు.  వాడు అని చెబుతున్నాం ఎందుకంటే ఆ తత్వం చేతనుడై ఉండాలి, మనకు తెలివి ఉంది మనలాంటి వారిని నియంత్రించే వాడికీ తెలివి ఉంటే తప్ప నియంత్రించడం కుదరదు. అందుకే చేతనుడై ఉండాలి ఆ తత్వం. దయ కల్గి నియంత్రించగలిగేదే ఆ తత్వం "ఏకమేవ అద్వితీయం"అని చాందోగ్య అనే శృతి తెలియజేస్తుంది. ఈ దయ నియంతృత్వం రెంటినీ కల్పి మనం శ్రీమన్నారాయణుడు అని చెబుతాం, అంటే 'శ్రీ' కల్గిన 'నారాయణుడు' అని అర్థం.

"చకార" ఈ జగత్తంతా చాతుర్వర్ణం. చాతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలుగా చెప్పటానికి యోగ్యత కల్గి ఉన్నది. నిలువుగా క్రమ పద్దతిలో నడిచే మానవులం ఒక వర్ణం అయితే, అడ్డంగా నడిచే పశువులూ, పక్షులూ మరియూ క్రిమి కీటాదులు తిర్యక్ అనే ఒక వర్ణం. ప్రాణం ఉన్నా లేకున్నా ఒక వద్ద కదలక పడి ఉండే చెట్లు, రాళ్ళు ఇవన్నీ స్థావరాలు ఇవి ఒక వర్ణం.  


ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అంటే వెనకాతల కొన్ని ధివ్యమైన శక్తివిశేషాలు మన బుద్దికి అందనివి కొన్ని ఉన్నాయి. ప్రమిద మనం తేగలం అందులో నెయ్యి పొయ్యగలం, ఇక దూదితో వత్తు పెట్టగలం, ఇక అగ్గిపెట్టెతో అగ్గి పుల్లని గీసి దీపం వెలిగిస్తున్నాం.  మరి అది దేనిలోంచి వచ్చింది అని చెప్పాలి. ఆ వచ్చే వేడి లేక కాంతి వీటన్నింటికన్నా విలక్షణమైన శక్తివిశేషం కలది. దానికి ధివ్యం లేక దేవ లేక సుర అని ఒక వర్ణం గా చెబుతారు. సుర నర తిర్యక్ స్తావర జాతులనే చాతుర్వర్ణం అని అంటారు.
సహ చకార - ఈ నాలుగు వర్ణాలను చేసిన వాడు, దేని చేత ?  "వేద శబ్దేభ్య ఏవ" వేద శబ్దాల చే చేసెను అని చెబుతుంది.
ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది.
 

వేదం నిత్యం


మానవ జాతికి మార్గ నిర్దేశ్యం చేయటానికి ఏర్పడ్డ వాంఙ్మయం వేద వాంఙ్మయం. ఆ వేద వాఙ్మయాన్ని మనం నిత్యం అంటాం. అంటే భూత,భవిష్యత్ మరియూ వర్తమాన ఈ మూడు కాలాల్లో ఒకేలా ఉండేది అని అర్థం. అది నిత్యం కనకనే దాన్ని ఏదో ఒకనాడు ఎవడో ఒకడు వ్రాసినవి కాదు. త్రేతాయుగంలో వాల్మీకి రామాయణాన్ని, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు భారతాన్ని వ్రాసెను అని చెబుతాం. కానీ వేద వాఙ్మయాన్ని అలా వ్రాసినది అని చెప్పము.

మనం చూస్తున్న ఈ సృష్టి కొత్తగా ఏర్పడలా, అది జరుగుతూనే ఉంది. మొదట కృత యుగం, ఆ తరువాత త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం, తిరిగి మళ్ళీ ఇక కృత,త్రేతా,ద్వాపర,కలి యుగం ఇలా చక్ర గతిన సాగుతూనే ఉంటుంది. ఇలాంటి 71 చతుర్యుగాలు, గడిస్తే ఒక మను సమయం అవుతుంది. ఒక్క చతుర్యుగం అంటే 43 లక్షల 20 వేల సంవత్సరాలు. ఆ తరువాత రెండో మను సమయం ప్రారంభం అవుతుంది. అలాంటి 14 మంది మనుల సమయం గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు,కల్పం లేక మహా ప్రళయం అంటారు. రోజు ఎంత రోజో బ్రహ్మ గారికి అంత రాత్రి కూడా ఉంటుంది. ఇక ఆయన రోజు ఇలా సాగుతూనే ఉంటుంది. అలాంటి బ్రహ్మకి ఇప్పుడు 50 యేండ్ల ఆయిస్సు గడిచిందని చెప్పవచ్చు.

మనలాంటి మనుష్యులు ఎప్పటి నుండో ఉన్నారు. పాశ్చాత్యులు చెప్పుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో జరగలా. ప్రతి యుగంలో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, ఋషులు ఉన్నారు. ఇవన్నీ పదవులు. వ్యాసుడు, పరాశరుడు ఇవన్నీ పదవులు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు జీవించే వారు. సూర్యుడూ ఒక పదవి. ఈ విషయాలని పాశ్చాత్యులు అంగీకరించకున్నా ఇది వాస్తవం. వాళ్ళు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెబుతారు కానీ అది ఏంటో ఇక పై చెప్పలేరు. మనం ఆ శక్తి విశేషాన్నే భూమాతా అంటాం. ఈ భూమిపై ఎన్నో చైతన్యం కల జీవరాశులు పుడుతున్నాయి, అందుకే మనం భూమికి చైతన్యం ఉంది అంటాం. అట్లా మనం చూస్తున్న ఈ సూర్యుడు పుట్టి 27 చతుర్యుగాలు అయ్యాయి. మనం ఉన్న చతుర్యుగంలో నాలుగో యుగంలో మనం ఉన్నాం. ఈ యుగం మొత్తం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇందులో ఇప్పటివరకు దాదాపు అయిదు వేల నూరు సంవత్సరాలు పైగా గడిచాయి.

వేదంలోని జ్ఞాన భాగమైన ఉపనిషత్తులలో మనకు కొందరి ఋషుల పేర్లు కనిపించవచ్చు. అవి వారు దర్శించిన వారు, వారు వ్రాసినవారు కాదు. ఈ మధ్య కాలంలో, అంటే ఈ కలియుగానికి ముందు ఉన్న సమయంలో ఉన్న ఋషులలా అని పించవచ్చు. ఉపనిషత్తులలో కనిపించే ఋషుల పేర్లను బట్టి మన వేదం పుట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పకూడదు. వేదం నిత్యం. ప్రపంచం అంతా ఒకనాడు భరతవంశానికి చెందినదే
వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.
రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాళ్ళు. మరికొందరు పాటించనివారుండే వారు. అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి. అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కందంలో  ఉంది. ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు. సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది. సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది. మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది. అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు. మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు. మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ భూమిని ఖండాలుగా విభజించిన నాభి అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవేత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి. ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు. అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు. ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు. అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా. అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు. ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.
 
ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది. మన పురాణాల లోనికి వారు వెళ్ళలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాళ్ళే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది. మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరికా కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే. ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాళ్ళకు ఇన్ని విషయాలు తెలియవు.
ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాళ్ళలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు. అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భారతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.
దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాళ్ళలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

(ఇంకా ఉంది...)

3 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి.

    ReplyDelete
    Replies
    1. చాలా సంతోషం అండి. మీ అభిప్రాయాలను అందించి ప్రోత్సహించగలరు.

      Delete
  2. Manchi Vishayalani chadhivinandhuku aanandhamga vundhi

    ReplyDelete