Wednesday, July 11, 2012

సనాతన వైదిక ధర్మం - 1

వాస్తవ అన్వేషణ - ప్రమాణాలు


జ్ఞానం కలిగి ఉన్నది మానవ జన్మ. పుట్టడం పెరగడం తరగడం ఇలా ప్రవాహంలా సాగుతుంది జీవన విధానం. మనుష్యులతో పాటు చుట్టూ ఎన్నో జీవులు, ప్రకృతి కనిపిస్తున్నాయి. మనకున్న జ్ఞానంతో మనం ఎంతవరకు బ్రతకవచ్చు ? ఒకరి ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎంతవరకు అంగీకరించవచ్చు? పెద్ద విశ్వంలో ఒక చిన్న మూలన మనం ఉన్నాం. మరి ఇంత విశ్వం ఏర్పడటానికి కారణం ఏదైనా ఉందా? మనం చూస్తున్న ఇన్నింటికి మనకు మధ్య సంబంధం ఏమిటి? మన లక్ష్యం ఏమిటి ? అందుకు మన ఆచరణ ఎట్లా ఉండాలి ?
ప్రమాణం అనేది ఏదైనా ఉందా ? ప్రమాణాలని ఎంతవరకు వాడుకోగలం ?
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు. అందరి ద్వారా ప్రేమించబడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. సంతోషమైన జీవనం ఎలా సాధ్యం? మనం అన్నప్పుడు నేను అనేది ఎవరు ? కేవలం శరీరమా, శరీరానికి వెనకాతల మరేదైనా ఉందా ? కేవలం శరీరమే అనుకుంటే మరి ముసలితనం తప్పడంలేదు ఎవ్వరికీ. అది శాశ్వతం కాదు, ఆతరువాత ఏమిటి పరిస్థితి తెలియడం లేదు. అప్పుడూ శరీరంలోని అన్ని అంగాలు ఉన్నా పనిచేయడం లేదు ఎందుకు. శరీరానికి వెనకాత ఒక ఆత్మ అనేది ఉంది అనేది గమనించాలి. బాల్యం నుంచి ముసలితనం వరకు శరీరం ఎంతో మార్పు చెందుతుంది, కానీ నేను మనం అని చెప్పే ఆత్మ మాత్రం అట్లానే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించడం అవసరమా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.
మనిషి జ్ఞానం కలవాడు. తెలుసుకోవడం మన స్వరూపం. కొందరు సంపదలు పెంచుకోవాలని అనుకుంటారు. కొందరు శరీరాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. కానీ ఆత్మ అనేది కేవలం జ్ఞానాన్నే స్వరూపంగా కలది. సరియైన జ్ఞానాన్ని పెంపొందిచ్చుకున్నప్పుడే ఆత్మకు ఉజ్జీవనం అవుతుంది. వాస్తవాన్ని తెలుసుకోవాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. వాస్తవాన్ని దర్శించాలి అని చేసే ప్రయత్నంలో మనం ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకొని ముందుకు నడవాలి. జ్ఞానాన్ని పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. అవి.
1. ప్రత్యక్షం
2. అనుమానం
3. ఆప్తవాక్యం (లేదా శబ్దం లేదా వేదం)మనకు ఎదుట కనిపించే వాటితో మొదలుకొని కనిపించని దాని వైపు అన్వేషణ సాగించడమే మనం చేయగలిగేది.

'ప్రత్యక్షం' ఎంత వరకు ప్రమాణం ?

వాస్తవాన్ని గుర్తించేందుకు మనం చేసే అన్వేషణకు ఒక ప్రమాణం ప్రత్యక్షం.
కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందడం. మనం జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయాలని గుర్తిస్తాం. జ్ఞానేంద్రియాలను సంస్కృతంలో అక్ష అని అంటారు, మనకు జ్ఞానాన్ని ప్రసరింపజేసే జ్ఞానేంద్రియాలను ప్రత్యక్షం అని అంటారు. లేక ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందినదాన్ని కూడా ప్రత్యక్షం అని అంటారు. కంటికి కనిపించేదాన్నే ప్రత్యక్షం అని అర్థం కాదు. కొందరు కంటితో చూస్తేనే నమ్ముతాం అని అంటుంటారు. ఒక పుష్పానికి వాసన ఉంటుంది, దాన్ని కంటితో చూడగలమా ? ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందాలి తప్ప, కంటితోనే  చూడలని అనుకోం. జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ఎదురుగా కనిపించిన దృశ్యం, వాసన మొదలైనవన్నింటినీ ప్రత్యక్షం అని అంటారు. ఉదాహరణకి యుద్దం చేసే వాడిని యోధ అని అంటారు. యుద్దాన్ని ఎవరితోనైతే చేస్తాడో వాడిని ప్రతియోధ అని అంటారు. అట్లానే జ్ఞానేంద్రియాలకు అభిముఖంగా ఉన్న వస్తువులు, వాసనలు, శబ్దాలు మొదలైన వాటిని కూడా ప్రత్యక్షం అని అంటారు. అంతే కాదు, మనం ఒక వస్తువును చూస్తున్నాం అంటే అది కంటికి ఆ వస్తువుకి మధ్య ఒక ప్రక్రియ జరుగుతుంది, మన జ్ఞానం ఆ వస్తువుదాకా వెళ్ళి దాని ఆకారాన్ని గుర్తించి తిరిగి మనవరకు తీసుకొస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను కూడా ప్రత్యక్షం అని అంటారు. మనం ఒకరి ద్వారా సమాచారాన్ని ఎవరివరకైనా పంపితే వారిని ప్రతినిధి అని అంటాం, అట్లానే మన జ్ఞానేంద్రియాల వరకు జ్ఞానాన్ని అందించే ప్రక్రియను ప్రత్యక్షం అని అంటారు.
అయితే ఈ పద్దతిలో మనం కేవలం జ్ఞానేంద్రియాలని వాడుతాం. కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా మనం మొత్తం జ్ఞానాన్ని పొందగలమా అనేది ప్రశ్నాత్మకం. అందులో కూడా లోపం ఉంది అనేది వాస్తవం. ఒక తాడును చూసి మనం పాము అను అనుకోవచ్చు. ఒక బొమ్మను చూసి మనిషేమో అని అనుకోవచ్చు. మనం ఒక సినిమా చూస్తాం. తెరపై దృశ్యం నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. కానీ వెనకాతల ఒక్కో దృశ్యాన్ని కల్గిన రీలును అతివేగంగా తిప్పుతుంటారు. అది తిరిగే వేగం మన కంటికి అందనంతలా ఉంటుంది కాబట్టి మనకు నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. అంటే మనకంటికి లోపం ఉన్నటే తెలుస్తుంది. అంతే కాదు శబ్దాన్ని గ్రహించే చెవులు అన్నింటిని గ్రహించలేవు. ఒక నాడు 10 పాటలు కల్గి ఉంటే సి.డి లో 100 పాటలు చేర్చుతున్నారు. ఎందుకంటే మనకు వినిపించని ఎన్నో స్వరాలని తీసివేసి ఆపాట మనకు ఎంతవినిపిస్తుందో అంతకు తగ్గిస్తున్నారు కనక ఎక్కువ పాటలని ఒక సి.డిలో వ్రాయగల్గుతున్నారు. అంటే మన చెవులకి లోపం ఉంది అని తెలిస్తుంది. జ్ఞానేంద్రియాలకు లోపం ఉంది అనే విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా తెలుపుతుంది అనేది స్పష్టం అవుతుంది.
కంటికి కనిపించడంలేదని మనం భగవంతుడు లేడు అని చెప్పడంలేదు,  భగవంతుణ్ణి గుర్తించవల్సింది మనస్సుతో. అందుకే మనం మనస్సును శుద్ది చేసుకోవాలి. అప్పుడు మనం భగవంతుడిని స్పష్టంగా దర్శించగలం. మన కంటికి కనిపించేందుకు భగవంతుడు స్వీకరించిన రూపమే విగ్రహం. అయితే అది ఒక అచేతన వస్తువుగా కనిపించవచ్చు, స్పష్టంగా దర్శించాలి అంటే మనం కొంత సాధన చేయవలసి ఉంటుంది.

'అనుమానం' ఎంతవరకు ప్రమాణం ?

 వాస్తవాన్ని గుర్తించేందుకు మనం చేసే అన్వేషణలో మరొక ప్రమాణం అనుమానం.
 అనుమానం - మానం అంటే కొలిచే పద్దతి. కాలానికి కొలమానం అంటే సమయాన్ని కొలవడం అని అర్థం. మన ఎదురుగా కనిపించే వాటి ద్వారా విషయాలని దర్శిస్తాం. మనకు కనిపించేదాన్ని బట్టి కొంత ఊహించగలం. అట్లా వాస్తవాన్ని దర్శించే పద్దతిని 'అనుమానం' అని అంటారు.   ప్రత్యక్షంగా చేసిన పర్యవేక్షణలో పొందిన జ్ఞానం ద్వారా కొంత ఊహిస్తాం. అట్లా మనం ఊహించి కొంత విషయాన్ని గుర్తించవచ్చు.
ఒక శబ్దాన్ని విని, అక్కడ ఒకరు ఉన్నారు అని గుర్తిస్తాం. అయితే ఊహకు ఆధారం ప్రత్యక్షం. అంతే కాదు కల అనేది సత్యమా ? కాదా ?. సత్యం అంటే 'సత్'- ఏదో ఒక ప్రమాణానికి అందేది అని అర్థం. అయితే కల కూడా మనకు చెడో, మంచో ఏదో ఒక అనుభవాన్ని ఇస్తుంది, అంటే అది ఒక ప్రమాణానికి అందినట్లే కదా. ఎప్పుడో మనం ప్రత్యక్షంగా గ్రహించిన జ్ఞానాన్ని మన మనస్సు లోన దాచుకొని ఉంటుంది, ఎప్పుడో ఒక నాడు అవే విషయాలు కొంత మార్పుతో స్వప్నంలో కనిపించి ఒక అనుభవాన్ని కలిగిస్తాయి.
మన ఇతిహాసాలు, పురాణాలు మనకు ఎన్నో విషయాలను తెలుపుతున్నాయి. అవన్నీ ఊహించి వ్రాసినవి అని కొందరు కొట్టి పాడేస్తుంటారు. అయితే ఒక విషయం గమనించాలి. ఊహ అనేది జరగాలంటే దానికి ప్రత్యక్షం అనేది తప్పని సరిగా ఉండి తీరాలి. ఆ విషయం సరియైనదో కాదో తరువాత విశ్లేషించుకోవచ్చు, కానీ నేరుగా కొట్టివేయడం అనేది సరియైన పద్దతి కాదు.
అయిటే మన ఊహ అన్ని చోట్లా సరియైన జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పలేం. అప్పుడప్పుడు తప్పు జరగ వచ్చు. మనం ఎన్నింటినో ఊహిస్తాం, ఒక కొండ వద్ద పొగ కనిపిస్తే అక్కడ నిప్పు ఉందేమో అని ఊహిస్తాం. కానీ అది పొగ మంచు అయి కూడా ఉండవచ్చు. మన ఇంటి ముందు వర్షం పడుతున్నంత మాత్రాన ఊరు మొత్తం వర్షం పడుతుంది అని చెప్పలేం, కొన్ని ప్రాంతాలలో వర్షం లేక పోయి ఉండవచ్చు. 
వాస్తవాన్ని దర్శించేందుకు అనుమానం అనే ప్రమాణం కూడా అన్ని చోట్లా సరియైనది కదు అని స్పష్టం అవుతుంది. ఇందులో కూడా లోపం ఉంది అనేది మనం గమనించాలి.

ఆప్తవాక్యం లేక వేదం - లోపం లేని ప్రమాణం 

మనం జ్ఞానాన్ని నేరుగా అంటే ప్రత్యక్షంగా కాక, ఊహించక మరొక పద్దతి ద్వారా గుర్తిస్తాం, దాన్నే ఆప్తవాక్యం అని అంటారు. ఆప్త వాక్యం అంటే మన అప్తుల ద్వారా అందే విషయం. ఆప్తులు అంటే ఎట్లాంటి స్వార్థం లేక మన మంచి కోరి చెప్పే వారు. మనం నేరుగా గుర్తించాల్సిన పని లేదు, ఊహించాల్సిన పనిలేదు, కానీ కొందరు చెప్పిన విషయాలను మనం నమ్ముతాం. వారు చెప్పిన మాటలనే ఆప్త వాక్యం అని అంటారు. మన పూర్వులు మనకు చెబుతారు, వారికి వారి పూర్వులు చెప్పారు, వారికి వారి ముందు వారు, ఇలా మన భారత జాతి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి జ్ఞాన సంపదను మనవరకూ తెచ్చి అందిస్తోంది. మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేకుండా అనుభవించే పిత్రార్జిత ధనం లాంటిది.

ఆప్తవాక్యాన్ని ఎట్లా నమ్మగలం ?

దీనికే మరొక పేరు 'శబ్దం'. శబ్దం అంటే సహజమైనది అయ్యి ఉండవచ్చు లేక కృత్రిమమైనది అయ్యి ఉండవచ్చు. కృత్రిమమైన శబ్దాలు మారుతూ ఉంటాయి. మనం తయారు చేసుకున్న భాషలు అన్నీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనం వాడే భాషల్లో కొన్ని పదాల అర్థాలు మనం ఏర్పాటు చేసుకున్నవి కనక అవి మనం మారిస్తే అవి మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉండవచ్చు. ఈ భాషలన్నీ మనం తయారుచేసుకున్నవి. మనం తయారు చేయని కొన్ని సహజమైన శబ్దాలు ఉంటాయి, అవి ఎప్పటీకీ ఒకేలా ఉంటాయి. ప్రకృతిలో మనకు వినిపించే గాలి యొక్క శబ్దం, సాగరం యొక్క శబ్దం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. అయితే ఈ సహజ శబ్దాలలో కొన్ని అర్థం కలిగిన శబ్దాలు ఉన్నాయి వాటినే వేదం అని అంటారు. అవి ఎవరో తయారుచేసినవి కావు.
ప్రత్యక్షం, అనుమానం అనే ప్రమాణాలతో వాస్తవాన్ని గుర్తించడం అనేది కష్టం. తప్పులు జరిగే అవకాశం ఎంతో ఉంది. ఇలా మన పూర్వులు ఈ విషయాన్ని గమనించి, కేవలం భాహ్యమైన వాటితో గుర్తించడం సాధ్యం కాదు అని గమనించి, వారు తమ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి లోనివైపు కేంద్రీకరించడం ప్రారంభించారు. అట్లా ఎంతోకాలంగా చేసిన ప్రయత్నానికి వారు ఎట్లాంటి లోపాలు లేని ప్రమాణంగా వేద శబ్దాన్ని గుర్తించారు. వేద శబ్దం 'అపౌరుషేయం'. ఎవరో ఒకరు చెప్పినదో వ్రాసినదో కాదు. వేద శబ్దం అనేవి ప్రకృతిలో ఉండే సహజమైన శబ్దాలు. ఊహకు అందని సృష్టి రహస్యాలు మనకు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. వేదాన్ని మనం లోపం లేని ప్రమాణం గా గుర్తిస్తాం.

అట్లా ప్రత్యక్ష్యం, అనుమానం మరియూ శబ్దం(లేక ఆప్తవాక్యం లేక వేదం) అనే ఈ మూడింటిని మనం ప్రమాణాలుగా తీసుకుంటాం. ఈ మూడు ఎట్లా వాడుకోవాలో తెలిపేవారే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అయితే ప్రత్యక్షం, అనుమానం లాంటి ప్రమాణాలలో ఎంతవరకు వీలు అవుతుందో అంతా అంగీకరిస్తాం. వేద మార్గాన్ని పూర్తిగా విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైధికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైధికమో ఏది అవైధికమో తెలిపాయి. అట్లాంటి వాటిని ఆధారంగా తీసుకొని వాస్తవ సందర్శన చేస్తాం.
 
 మనం తయారుచేసిన వాటిలో లోపం ఉండే అవకాశం ఉంది. ఒక వస్తువుని చూసి మరొకటి అని అనిపించే అవకాశం ఉంది, దీన్నే బ్రాంతి అని అంటారు. అట్లా బ్రాంతితో చెప్పేవాటిలో లోపం ఉంటుంది. మరొక కారణం, ఉన్నదాన్ని స్పష్టంగా చూడలేక పోతాం, దీనికి పరాక్కు లేదా ప్రమాదం అని అంటారు. మూడోది విప్రలిప్స, ఎదుటివారిని సంతోషపెట్టేందుకు కల్పించి చెప్పేవి. మన పురాణాల్లో కూడా ఈ దోషాలు ఉన్నాయి. ఏదో ఒక వ్యక్తి సంతోషపడుతాడని వ్రాసినవీ ఉన్నాయి. అట్లాంటివి మనకు ప్రమాణాలు కావు. నాలుగోది, మనలో అశక్తి, కొన్నింటిని మనం అనుభవిస్తుంటాం కానీ వ్యక్తపరచలేం. ఎన్నో అనుభవాలని మాటలో తెలుపలేం. అన్నింటిని తెలుపగలిగే వాంఙ్మయం అనేది లేదు. మనం వ్యక్తం చేసే వైధికమైన శబ్దాలు కూడా వాంగ్మయ రూపంలోనే ఉండడంచేత,  వాంఙ్మయ రూపంలో ఉన్న వేదం కూడా భగవత్ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే చెప్పడం నాకూ చేతకాదు అని ఒప్పుకుంది. "ఎతో వాచో నివర్తంతే అప్రా ప్యమనసాసహ ఆనందం బ్రహ్మణో విద్వాన్" అంటుంది తైత్తిరీయం అనే వేద శాఖ. కొంత వరకు చెప్పగలను, కొంత ఊహించుకొనేంతవరకు కల్పన చేసి చెప్పగలను, కానీ పూర్తిగా చెప్పడం నాకూ చేతకాదు అంటుంది. భ్రమ, ప్రమాదం, విప్రలిప్స, అశక్తి అనేది జీవ నిర్మితములైన వాటికి ఉంటాయి కానీ వేదానికి అట్లాంటి దోషాలు ఉండవు. దీన్నే శాస్త్రం అని అంటాం. అంటే మనల్ని శాసించగలదు అని అర్థం. మనం ఇది చేయవచ్చు, ఇది చేయ కూడదు అని కృత్యాకృత్యములని, ఉన్న వస్తువులేమి, లేని వేమి అని నిరూపించ సామర్థ్యం కలది శాస్త్రం. శాస్త్రం అంటే మనకు కనిపించే సామాన్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, రసాయణ శాస్త్రం ఇలాంటివి కాదు. శాస్త్రం అన్నాం అంటే అది వేదం అని అర్థం

(ఇంకా ఉంది...)

No comments:

Post a Comment