Wednesday, September 5, 2012

సనాతన వైదిక ధర్మం - 6

ఉపబ్రాహ్మణాలు - వ్యాఖ్యాన గ్రంథాలు


ఇవి వేదంలో కనిపించక సూక్ష్మంగా ఉన్న విషయాలను స్పష్టంగా కనబడేట్టు చేస్తాయి, ఒక భూతద్దం వలె. భూతద్దం ఉన్న వాటినే పెద్దగా చేసి చూపిస్తుంది కానీ కొత్తవాటిని కల్పించదు అట్లానే. వేదాలు అపౌరుషేయం కానీ వివరణ వ్యాఖ్యానాది గ్రంథాలు అన్నీ మనుషులు చేసినవే. వేదాంగాలు వేదాలలోని అర్థాన్ని నిర్ణయించేవి. భూతద్దంతో చూస్తే మరింత స్పష్టంగా కనిపించినట్లు వేదాన్ని వివరించి చూపేవి వ్యాఖ్యానాలు.
వేదంలోని అర్థాలని మరింత వివరించి చెప్పే గ్రంథాలు ఉన్నాయి. అవి.

1. స్మృతి


మన ఋషులు ఆచరించి మనకు అందించిన ధర్మ శాస్త్రాలను స్మృతి అని అంటారు. అన్నింటిలో మను స్మృతి మొట్ట మొదటిది. అట్లానే పరాశర స్మృతి, హారీత స్మృతి మొదలైనవి. సమాజంలో ప్రతి ఒక్కరి  బాధ్యతలను, వారు వారు ఎట్లా బ్రతికాలో తెలిపేవి. శిశువు జన్మించినప్పుడు చేసే జాతకర్మ, శిశువు పెరిగేప్పుడు ఎప్పుడు అన్నప్రాసన చేయాలి, అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, వివాహాది క్రియలు మొదలుకొని  మనిషి మరణించిన తరువాత వరకు చేయాల్సిన అనుష్టానాలని చెబుతాయి. కుటుంభాలలో చేయాల్సిన విధులని కూడా తెలుపుతాయి. అవి సూత్రాలవలె ఉంటాయి. కుటుంభాలకు సంబంధించినవి గృహ్య సూత్రాలు, సమాజానికి సంబంధించినవి స్రౌత సూత్రాలు అని అంటారు, యాగం ఎట్లా చేయాలి, వర్షాలు రావాలంటే ఏమి చేయాలి, పిల్లలు కావాలంటే చేయాల్సిన యాగాలు, కొన్ని కోరికల కోసం చేయాల్సినవి. వేదాలలోని విషయాలనే సూత్రాలుగా మార్చి వ్రాసినవి.

2. ఇతిహాసాలు


మరి స్మృతిని ఎట్లా నమ్మడం? దాన్ని ఆచరించినవారి గురించి తెలిస్తే మనకు నమ్మకం వస్తుంది. అట్లా ఆచరించిన వారి చరిత్రను మనకు అందించారు, అవే ఇతిహాసాలు. అవి ఎట్లా అయితే జరిగాయో అట్లానే తీసుకోవాలి. చరిత్రను మార్పు చేయకూడదు. ఇతిహాసాలు రెండే. అవి రామాయణం మరియూ మహా భారతం. రామాయణాన్ని తీసి చూస్తే రామాయణంలోని ఏదో ఒక పాత్రలో మనల్ని చూసుకోవచ్చు. అప్పుడు మనం ఎట్లా బతికితే బాగుపడతామో సవరించుకొని బ్రతకవచ్చు.

3. పురాణాలు


వేదాలలోని విషయాలని తెలిపి మనల్ని ఉత్తేజపరచడానికి వచ్చినవే పురాణాలు. వేద వ్యాసుడు అందించినవి. 18 పురాణాలు ఉన్నాయి. 18 ఉప పురాణాలు ఉన్నాయి. పురాణ అంటే పాతవి అని అర్థం కాదు, 'పురాపి నవం' పాతవి కానీ ఎప్పటికీ స్వచ్చంగా ఉండేవి. కొన్ని కథల రూపంగా ఉంటాయి, కొన్ని కథలు జరిగినవి కాక పోవచ్చు, అవి నిజంగా జరిగాయా అని ఆలోచించాల్సిన అవసరం లేదు, అక్కడి సారాంశాన్ని మనం అర్థ చేసుకోవాలి. ఇతిహాసాలలో ప్రతి విషయం జరిగినట్టే తీసుకోవాలి.

పురాణాలు -
 మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం |
అనాపలింగ కూస్కాని పురాణాని తథైవచ          ||

 1. మత్స్య పురాణం
 2. మార్కండేయ పురాణం
 3. భవిష్య పురాణం
 4. భాగవత పురాణం
 5. బ్రహ్మ పురాణం
 6. బ్రహ్మాండ పురాణం
 7. బ్రహ్మవైవర్త పురాణం
 8. వరాహ పురాణం 
 9. వామన పురాణం
10. వాయు పురాణం
11. విష్ణు పురాణం
12. అగ్ని పురాణం
13. నారద పురాణం
14. పద్మ పురాణం
15. లింగ పురాణం
16. గరుడ పురాణం
17. కూర్మ పురాణం
18. స్కంద  పురాణం
ఉప పురాణాలు -
 1. సనత్కుమార పురాణం
 2. నరసింహ పురాణం
 3. శివధర్మ పురాణం
 4. దౌర్వాస పురాణం
 5. నారదీయ పురాణం
 6. కాపిల పురాణం
 7. మానవ పురాణం
 8. ఔసనశ పురాణం
 9. బ్రంహాండ పురాణం
10. వారున పురాణం
11. కౌశిక పురాణం
12. లైంగ పురాణం
13. సాంబ పురాణం
14. సౌర పురాణం
15. పారాశర పురాణం
16. మారీచ పురాణం
17. భార్గవ పురాణం
18. స్కాంద పురాణం
  

4. ఆగమాలు

మనం ఆచరించేప్పుడు మనం అభ్యాసం చేసుకోవడానికి ఎట్లాటి ఏర్పాటు చేసుకోవాలో తెలిపేవి ఆగమాలు. వేదాలు చెప్పిన విష్ణువుని, శివుడిని ఎట్లా ఆరాధించాలో తెలిపేవి వైష్ణవ, శైవ ఆగమాలు. ఆరాధించేప్పుడు ఆ దేవుడు ఎట్లా మనం చూపిన విగ్రహాన్ని స్వీకరిస్తాడో తెలుపుతాయి. ఆలయాల్లోని వివిద కార్యక్రమాలు ఎట్లా చేయాలో తెలుపుతాయి. పాంచరాత్ర, వైఖానస ఆగమాలు వైష్ణవ ఆగమాలు.  పాంచరాత్ర నారాయణుడు అందించినదే. శైవం, పాశుపతం శైవ ఆగమాలు. శక్తి, దుర్గ, కాత్యాయని వంటి స్త్రీ దేవతల ఆరాధనా పద్దతులని తెలిపేవి శాక్తేయ ఆగమాలు. గ్రామ  దేవతలు అని గ్రామాల్లో సంవత్సరానికి ఒక సారి పూజిస్తుంటారు వాటిని తెలిపేవి గాణాపత్యం అని ఆగమాలు. కొన్నింటిని అదిపతిగా కల్గిన దేవతలను గణపతి అంటారు. అందుకే గాణాపత్యం అని పేరు. అవి కూడా కొన్ని పద్దతులు, అయితే అవి మనం పాటించవచ్చా, కూడదా మనం ఆలోచించాల్సినది. కొందరు తామస గుణాలను కోరుతారు, వారు అట్లాంటి దేవతలనే పూజిస్తారు. మనం సాత్వికాన్ని కోరినప్పుడు మనం కోరుకున్నదేదో ఇచ్చే దేవతని మనం పూజించాలి. ఇవన్నీ లోకంలో ఉన్న పద్దతులు. నారాయణుడే పరతత్వం అయినప్పుడు ఇన్ని దేవతలు ఎందుకు అని అనిపిస్తుంది, కానీ మనిషి జ్ఞానాన్ని బట్టి ఆయా దేవతని పూజిస్తారు, అందరికి జ్ఞానంలోని స్థాయి నారాయణుడి వరకు వెళ్ళక పోవచ్చు. కానీ ఉన్నవారిని కాదనలేం, మనకు ఎవరు కావాలో మనం చూసుకొని బ్రతకాలి. గడ్డితినే ఆవు, ఆ గడ్డి ఇచ్చే బియ్యాన్ని తినే మనిషిని ఒకే వద్ద ఉంచాడు భగవంతుడు అది భగవంతుని గొప్పతనం. మనకు కావల్సినదేదో తెలుసుకొని తినాలి.

5. ప్రబంధాలు

అట్లా దేవతలని ఆరాధించేప్పుడు వారిని ఎట్లా స్థుతించాలో తెలుపడానికి వచ్చినవి ప్రబంధాలు. ప్రబంధాలు అంటే పై విషయాలను అనుభవించి వారి వారి భాషలలో అందంగా వ్రాసిన కావ్యాలని ప్రబంధాలు అని చెబుతారు. రామాయణాన్ని ఎందరో ఎన్నో భాషలుగా వ్రాసుకున్నారు, అవన్నీ ప్రబంధాలు. ఆళ్వారులు తమిళ భాషలో వ్రాసారు, అవీ ప్రబంధాలే. ఇవన్నీ వేదంలోని విషయాలను తెలుపడానికే వచ్చినవి.
అయితే స్మృతులు మొదలుకొని ప్రబంధాల వరకు పురుష నిర్మితాలు. మరి వాటిని ఎట్లా ప్రమాణంగా తీసుకోవడం ? వేదాలకు విరుద్దంగా కాకుండా వేదానికి అనుగుణంగా చెప్పే స్మృతులు అంగీకరించవచ్చు. ఇతిహాసాలలో ఎన్నో విషయాలు ఉండవచ్చు, అందులో వేదాలు, స్మృతులు చెప్పిన విషయాలను మాత్రం తీసుకోవాలి. పురాణాలలో ఇతిహాసాల విషయాలను చూపే వాటిని మనం ప్రమాణంగా తీసుకుంటాం. ఆగమాల విషయాలలో వేదాల్లో, స్మృతులలో, ఇతిహాసాలలో మరియూ పురాణాలలో అంగీకరించిన క్రమంలో ఉన్న వాటినే ప్రమాణంగా స్వీకరిస్తాం. ప్రబంధాలు అట్లానే ప్రమాణికమైనవే అంగీకరిస్తాం. పౌరుషేయాలైన ఉపబృంహణాల విషయంలో వేదం చెప్పినవాటినే అంగీకరిస్తాం

వేదం తెలిపేది ధర్మాన్ని

వేదాలు చెప్పేవి ముఖ్యంగా ధర్మం గురించే. శాస్త్రాలు ఎక్కడా ధర్మాన్ని వదిలేయమని చెప్పవు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. మనం కర్మ ఆచరణను ఎట్లా చేయాలో తెలుపుతాయి, కానీ మన కర్మని వదిలివేయడం అనేది ఉండదు. ధర్మం అనగానే ఇది ఒక మతపరమైనది అని భావన. కానీ అది తప్పు. జీవితం వేరు, మతం వేరు కాదు. ధర్మం అనేది మనం ఆచరించేది, ఒక్కోసారి మనం చేసేది వృదా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఒకనాడు మన కష్టకాలంలో కాపాడుతుంది. మనం ధనాన్ని దాచుకుంటే అది వడ్డీతో పాటు మన అవసరానికి ఆదుకుంటుందే అట్లానే ధర్మం కూడా. అన్నింటికీ అర్థం తెలియనవసరం లేదు కానీ మనం ఆచరించాలి. అది కేవలం ఈ లోకం కోసమే కాదు పరలోకంలో కూడా మనల్ని రక్షించేది.
ధర్మం అంటే ఏమిటో ఆపదం ఏర్పడ్డ ధాతువుల నుంది తెలుస్తుంది. 'ద్రియతే ధారయతే ఇతి ధర్మః'. మనం మొదట ధర్మాన్ని ఆచరిస్తాం, ఆపై అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ఏమిటో మన ఋషులు అందమైన వివరణ ఇచ్చారు, 'ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః'. మనం అసలు కోరేది ఏమి అంటే అది ఆనందం. ఎక్కడ ? మనం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండగా ఆనందంగా ఉండాలి. ఇక్కడి నుండి ఏలోకానికి వెళ్ళినా అక్కడా అనందంగా ఉండాలి. స్వర్గంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉండరట. అక్కడ ఉన్నప్పుడు అక్కడి సుఖాలకు అలవాటు పడి ఉంటారు. అది వదులుకోవాలని అనిపించదు వారికి. అక్కడ వారు కోరినవి అన్ని లభిస్తాయి, కానీ అక్కడ ఉండటం అనేది మన పుణ్యం ఉన్నంత వరకే. అది ఖర్చు అయ్యాక తిరిగి ఇక్కడికి రావల్సిందే. అక్కడ మనం అనుభవించడం వరకే మనం చేయగలిగేది కానీ పుణ్యాన్ని అంటూ సంపాదించే అవకాశం ఉండదు. ఏది సంపాదించాలన్నా తిరిగి భూమిపై మాత్రమే సాధ్యము. వేదాన్ని అర్థం చేసుకొని బ్రతికేవారు ఎప్పుడూ స్వర్గాన్ని కోరరు. నేరుగా భగవంతుని వద్దకే వెళ్ళాలని కోరుకుంటారు, లేకుంటే ఇక్కడే ఉండాలి అని కోరుకుంటారు. పరమపదానికి వెళ్ళాలంటే భూమి నుండే వెళ్ళే అవకాశం ఉంది తప్ప స్వర్గాది లోకాలల నుండి కాదు. మనం ఒక్కటి చేసి అన్ని ఫలాలు అందించగలిగేది ధర్మం అంటే. అయితే స్వర్గాది లోకాలకు వెళ్ళాలన్నా, నిత్య నిలయమైన పరమపదానికి వెళ్ళాలన్నా మనం ధర్మాన్ని ఆచరించవలసిందే.

ధర్మం అనేది చెప్పేది కాదు. అందరూ తప్పక ఆచరించాల్సింది. ఎందుకు తప్పని సరిగా ఆచరించాలి. మనంతట మనం ఒకరికి హాని చేయక  మన దారిన మనం బ్రతకుతున్న వారు కూడా ధర్మాన్ని ఆచరించాలా, అలా బ్రతికితే చాలదా ? అనేది కొందరి ప్రశ్న. అది సరియైనదే, కానీ మనం పొందాల్సిన అసలు ఫలం కూడా ముఖ్యమే కదా. అది కూడా ఆలోచించుకోని బ్రతకాలి. అయితే మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషం వంటివి మనం ఎంత కాదన్నా తప్పక కలుగుతుంటాయి. ఒక చెట్టు తాను ఏమి ఆశించక లోకానికి ఎంత ఉపకారం చేస్తుంది. మనం కనీసం ఒక చెట్టు చేస్తున్న ఉపకారం అయినా చేస్తున్నామా. అట్లా చూస్తే మనిషి చెట్టుకంటే ఎంతో చేయగలడు, అట్లా చేయక ప్రకృతిలోని ఎన్నింటినో మనం వాడుకుంటున్నాం, అప్పుడు మనం ప్రకృతిని దొంగలించినట్లే కదా లెక్క. మనిషి యొక్క యోగ్యత చెట్టు కంటే చాలా గొప్పది. అది ఆలోచించి బ్రతకాల్సిన భాద్యత మనిషిది. అట్లా మనిషి ఆచరించాల్సినదే ధర్మం అంటే. ఆధర్మాన్నే మన ఋషులు ఆచరించి మన వరకూ అందించారు. ఎలా తెలియాలి ధర్మం అంటే 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదంలోని ప్రతి అక్షరం ధర్మాన్ని చెప్పడానికే.
 అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు. 
(ఇంకా ఉంది...)