Wednesday, June 27, 2012

శ్రీ ఉషశ్రీ గారి గురించి

ఉషశ్రీ (మార్చి 16, 1928 - సెప్టెంబరు 7, 1990) అసలు పేరు శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో 1928 సంవత్సరం మార్చి 16 న జన్మించారు. తండ్రి శ్రీ పురాణపండ రామూర్తి. తండ్రి ఆయుర్వేద వైద్యుడు,తల్లి కాశీ అన్నపూర్ణ. జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా పనిచేశారు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద రామాయణం, మహాభారతం మహాభాగవతం ప్రవచనం చేశారు. ఉషశ్రీ ఆకాశవాణి విజయవాడ కేద్రంలో అనేక సంవత్సరాలు పని చేశారు. ఆ కాలంలో ఆయన నిర్వహించిన "ధర్మ సందేహాలు" కార్యక్రమము చాలా పేరు పొందినది. ఆ తరువాత వారం వారం రామాయణ మహా భారతాలను ఆకాశవాణి నుండి ప్రవచనం చేశారు. 1973 లో రేడియోలో భారత ప్రవచనం ప్రారంభించారు. అప్పట్లో, దూరదర్శన్ లేదు. ఉషశ్రీ పురాణ ప్రవచనాలు వారానికి ఒకసారి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేది. శ్రోతలు రేడియోల ముందు మూగేవారు. ఆ అరగంటసేపు బయట ప్రపంచాన్ని మరచి ఆ పురాణ గాధలలో మునిగి తేలేవారట.
ఈ విధంగా ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు

శ్రీ ఉషశ్రీ గారి రామాయణ ప్రవచనాలు

Wednesday, June 20, 2012

శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్రకుమార్ గారి అద్బుతమైన లేఖ

రచయిత: శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్రకుమార్ గారు


శ్రీ గురుభ్యోన్నమః
నమస్తే
ప్రశ్న మంచిదే, దీనికి ముందు ధర్మమంటే ఏదో ముందు తెలుసుకోవాలి. ఇంతకు ముందు "ధర్మం" పైన చర్చ జరిగింది. అందులో ధర్మం అంటే ఉన్న అర్థము నిర్వచనాదులద్వారా ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించుకోవాలి.
ఇక ఈ చర్చలో ఉన్న స్వధర్మం విషయానికొస్తే, స్వధర్మం అంటే కేవలం వర్ణ ధర్మమో ఆశ్రమ ధర్మమో మాత్రమే కాదు. ముఖ్యంగా అవే ఐనా. మనకి వేదం నిర్దేశించిన పనులు భగవంతుడు నిర్దేశించిన పనులు మన ఉన్నతికి పాటుపడేవి ధర్మం. స్వధర్మాచరణము అంటే స్వకర్మాచరణము కాదు. రెంటికీ తేడా ఉంది. చాలా మంది గీతలో మీరు పైన ఉటంకించిన శ్లోకం చదివి కుమ్మరి కుండలు చేయాలి, చాకలి బట్టలు ఉతకాలి, క్షత్రియుడు యుద్ధం చేయాలి బ్రాహ్మణుడు వేదం చదివి పూజాధికాలు నిర్వర్తించాలి వంటివే అనుక్కుంటారు. కానీ ఇలా వ్యాఖ్యానం స్వకర్మాచరణమునకు సరిపోతుంది కానీ స్వధర్మాచరణమునకు వ్యాఖ్యానంగా కొంత మాత్రమే సరి. ధర్మం ఎప్పుడూ దేశ కాలాలను బట్టి సందర్భాన్ని బట్టి మారుతుంది. మీరు ఏ సందర్భంలో ఏ పని చేయడం ద్వారా ధర్మ చట్రంలోకి ఎక్కుతారో తెలుసుకుని ఆపనిని చేయడం స్వధర్మాచరణం. ఉదాహరణకు తీర్థయాత్రలకెళ్ళినప్పుడు శరీర
దౌర్భల్య రీత్యా కొంత సమయం గడిచేటప్పటికి ఏదో ఒకటితినవలసిన అవసరం ఉందనుక్కోండి అప్పుడు ఆ వ్యక్తి స్వధర్మం అప్పటికప్పుడు తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి ఏదో ఒక ఆహారం తినడమే, తాను స్నానం చెయ్యకపోయినా, ప్రయాణంలో ఉన్నా, నించుని ఎడం చేత్తో పట్టుకుని తినవలసి వచ్చినా తప్పదు. అప్పుడు చేయగలిగిందేమంటే ఇందులో కూడా ఎంత వీలైనంత ధర్మబద్ధంగా తినగలమా అని చూసుకుని ఆహారం తీసుకోవాలి. ఒకవేళ ధర్మంప్రకారం నించుని తినకూడదు, స్నానం చేయకూడదు అని తినడం మానేస్తే ఆ వ్యక్తి శరీరాన్ని శుశ్కింపచేసిన
దోషం కలుగుతుంది. ఇటువంటి ఆపద్ధర్మాలకి ప్రాయశ్చిత్తంగా వెంటనే ఒక
దర్భనో, లేక అక్కడే ఎక్కడైనా ఉన్న గడ్డి పోచనో (దూర్వాంకురము)
ముట్టుకోవాలి. స్వధర్మాచరణం అంటే నీ జన్మతః నువ్వు ఎటువంటి నిత్య విధులు నిర్వర్తించాలో అది నిర్వర్తించాలి, బిడ్డగా తల్లితండ్రులను ఎలా చూసుకోవాలో, వారితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా నమస్కారం చేయాలో అలా చేయాలి (తల్లికి నమస్కారం చేస్తే రెండు చేతులు కలిపి నమస్కార ముద్రతో తన ఉదరానికి/ నాభికి దగ్గర పెట్టి నమస్కరించాలి, తండ్రికైతా అదే నమస్కారాన్ని తన ముఖం అంటే నోటిదగ్గర పెట్టి నమస్కరించాలి) ఇలా పుత్ర ధర్మం నిర్వర్తించాలి. భార్య వద్ద అనునయంతో భర్తృ ధర్మం నిర్వర్తించాలి, పిల్లల యెడ పితృధర్మం నిర్వర్తించాలి. వీరందరి పోషణార్థమై ప్రయత్నం చేయాలి. ఉద్యోగం కోసం నీ విధిలను నీవు మానరాదు. ఎక్కడో మేనేజర్ పోస్ట్ ఉద్యోగంలో ఉన్నా, నీ ధర్మం ప్రకారం నిత్యం ఎటువంటి విధులు నిర్వర్తించాలో అవి చేయాలి.
స్వాధ్యాయాదులు చేయాలి కుటుంబ పోషణార్థమై నీకు సంస్థ ఇచ్చే డబ్బు
సద్వినియోగం చేయాలి ధర్మకార్యాచరణానికే ఖర్చుపెట్టాలి. అలానే నీ సంస్థ
యందు నువ్వు ఉద్యోగ ధర్మంతో మెలగాలి. నీధర్మం నువ్వు నిర్వర్తించడానికి పెద్ద పెద్ద ఆటంకాలు రావు, ఏదైనా పెద్ద
అడ్డంకి వచ్చినా అది మన మనస్సే.
బహుశా నేను చెప్పినది అంత సులభంగానూ సరళంగానూ లేకపోవచ్చు
మీరు చెప్పిన ఉదాహరణకే వస్తే కార్యాలయాల్లో చెప్పులు వేసుకుని నిలబడి తినాలి అది తప్పు మరి ఎలా... నాకు తెలిసిన ఒక స్నేహితుడు (పేర్లెందుకు) ఇటువంటి సందర్భాన్నే ఎదుర్కొని ఈ మధ్యనే కాస్త అద్దె ఎక్కువైనా తన ఆఫీసు కి దగ్గరగా ఇల్లుతీసుకుని మారాడు వీలైతే ఇంటికెళ్ళి తినడానికి. ఇంకో స్నేహితుడు కూడా అలానే దగ్గరే తీసుకుని ఇంతకు ముందు తాను ప్రయాణం చేసి రావడానికి కల సమయాన్ని పది వంతులు తగ్గించుకుని ఆఫీసు మొదలయ్యే పావుగంట ముందు భోజనం చేసి ఐదు నిమిషాల్లో ఆఫీసు చేరుకుంటాడు. మధ్యాహ్నం ఏమీ తినడు
మరీ అవసరమైతే పళ్ళు కానీ పళ్ళ రసం కానీ తీస్కుంటాడు. తిరిగి ఇంటికెళ్ళి యదావిధి సంధ్యావందనం, భోజనం చేయడం. కుటుంబంతో ఆయాధర్మాలలో మెలగడం, వీలైతే గంటో అరగంటో స్వాధ్యాయమో (నేర్చుకున్నది తెలుసుకున్నది నెమరు వేసుకోవడం, కొత్తవి తెలుసుకోవడానికి ప్రయత్నించడం)  నామటుక్కు నాకు అతని కర్తవ్య
నిర్వహణ గొప్పది, అతని స్వధర్మంలో అతను నిలబడడానికి తనకు చేతిలో ఉన్నంత మార్పు తన జీవన శైలిలో తెచ్చుకున్నాడు. (వీళ్ళేమీ గొప్ప గొప్ప ఆస్తి పరులో లేదా సాగించుకునే కుటుంబాలలో వారో కాదు, సగటు ఉద్యోగులు) ఇంకోటి ధర్మం గురించిన మాట వచ్చింది కాబట్టి. మనం చాలా మంది ఇది నాబాధ్యత అది నాబాధ్యత అంటూంటాం. ధర్మ చట్రంలో బాధ్యత అన్న పదానికి తావులేదు. ఒక మనిషి జీవనం కర్తవ్యతానిష్ఠతో సాగాలి, బాధ్యత మనిషిని సంసారంలోకి లాగి లాగి ముంచేస్తుంది. (ఉదా: నా కొడుకుని చదివించి ఇంజనీర్ని చేయడం నా కర్తవ్యం, చదివేటట్టుగా అన్ని రకాల శిక్షణ ఇప్పించటం నాకర్తవ్యం. ఐనా వాడు చదవకపోతే అది వాడి ఖర్మ. అదే అది నాబాధ్యత అని తీసుకుంటే, వాడికొ అర్హత లేకపోయినా వాడు ఇంజనీర్ అయ్యేంత వరకూ వాడి వెంటే ఉండి అవసరమైన అన్ని పనులూ చేసి వాణ్ణి ఇంజనీర్ని చేయడం. సనాతన ధర్మం ఎప్పుడూ కర్తవ్యం గురించే మాట్లాడుతుంది, బాధ్యత గురించి కాదు.)
నీ విహిత కర్మాచరణమేమున్నదో, కర్తవ్య నిష్ఠఏదున్నదో అదే నీ ధర్మాచరణముగా మారుతుంది.
కార్పొరేట్ వ్యవస్థ మన ధర్మాచరణమునకు ఆటంకమైతే, ఇతరమతస్తులకీ అవ్వాలికదా, వారు చక్కగా వారి పండగల మాసంలో ఉపవాసం ఉన్నామని త్వరగా ఇంటికి వెళ్తారు, ఆఫీసులో ఉండే మధ్యాహ్నకాలంతో కలిపి పంచకాల ప్రార్థనలు చేస్తారు. తేడా ఒక్కటే మనం మన ధర్మానికి నిలబడి, నిలదీసి ఈకాలం/ సమయం మాకు వెసులుబాటు చేయండి మాధర్మనిష్ఠకు లోపమొస్తోందని అడగం.


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

Sunday, June 17, 2012

సనాతన వైదిక ధర్మం‎

వేదం తెలిపేది ధర్మాన్ని

వేదాలు చెప్పేవి ముఖ్యంగా ధర్మం గురించే. శాస్త్రాలు ఎక్కడా ధర్మాన్ని వదిలేయమని చెప్పవు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. మనం కర్మ ఆచరణను ఎట్లా చేయాలో తెలుపుతాయి, కానీ మన కర్మని వదిలివేయడం అనేది ఉండదు. ధర్మం అనగానే ఇది ఒక మతపరమైనది అని భావన. కానీ అది తప్పు. జీవితం వేరు, మతం వేరు కాదు. ధర్మం అనేది మనం ఆచరించేది, ఒక్కోసారి మనం చేసేది వృదా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఒకనాడు మన కష్టకాలంలో కాపాడుతుంది. మనం ధనాన్ని దాచుకుంటే అది వడ్డీతో పాటు మన అవసరానికి ఆదుకుంటుందే అట్లానే ధర్మం కూడా. అన్నింటికీ అర్థం తెలియనవసరం లేదు కానీ మనం ఆచరించాలి. అది కేవలం ఈ లోకం కోసమే కాదు పరలోకంలో కూడా మనల్ని రక్షించేది.
ధర్మం అంటే ఏమిటో ఆపదం ఏర్పడ్డ ధాతువుల నుంది తెలుస్తుంది. 'ద్రియతే ధారయతే ఇతి ధర్మః'. మనం మొదట ధర్మాన్ని ఆచరిస్తాం, ఆపై అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ఏమిటో మన ఋషులు అందమైన వివరణ ఇచ్చారు, 'ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః'. మనం అసలు కోరేది ఏమి అంటే అది ఆనందం. ఎక్కడ ? మనం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండగా ఆనందంగా ఉండాలి. ఇక్కడి నుండి ఏలోకానికి వెళ్ళినా అక్కడా అనందంగా ఉండాలి. స్వర్గంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉండరట. అక్కడ ఉన్నప్పుడు అక్కడి సుఖాలకు అలవాటు పడి ఉంటారు. అది వదులుకోవాలని అనిపించదు వారికి. అక్కడ వారు కోరినవి అన్ని లభిస్తాయి, కానీ అక్కడ ఉండటం అనేది మన పుణ్యం ఉన్నంత వరకే. అది ఖర్చు అయ్యాక తిరిగి ఇక్కడికి రావల్సిందే. అక్కడ మనం అనుభవించడం వరకే మనం చేయగలిగేది కానీ పుణ్యాన్ని అంటూ సంపాదించే అవకాశం ఉండదు. ఏది సంపాదించాలన్నా తిరిగి భూమిపై మాత్రమే సాధ్యము. వేదాన్ని అర్థం చేసుకొని బ్రతికేవారు ఎప్పుడూ స్వర్గాన్ని కోరరు. నేరుగా భగవంతుని వద్దకే వెళ్ళాలని కోరుకుంటారు, లేకుంటే ఇక్కడే ఉండాలి అని కోరుకుంటారు. పరమపదానికి వెళ్ళాలంటే భూమి నుండే వెళ్ళే అవకాశం ఉంది తప్ప స్వర్గాది లోకాలల నుండి కాదు. మనం ఒక్కటి చేసి అన్ని ఫలాలు అందించగలిగేది ధర్మం అంటే. అయితే స్వర్గాది లోకాలకు వెళ్ళాలన్నా, నిత్య నిలయమైన పరమపదానికి వెళ్ళాలన్నా మనం ధర్మాన్ని ఆచరించవలసిందే.
 మనం నివసిస్తున్న భూమి ఒక సౌరమండలంలో ఉంది. అట్లాంటి ఎన్నో గోళాలు కలిస్తే ఒక అండం అని అంటారు. అట్లాంటి అనంతమైన ఎన్నో అండాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. అట్లాంటి అనంతమైన బ్రహ్మండాలు కలిపితే అది లీలా విభూతి అని అంటారు. పరమాత్మను అఖిలాండ కోటి బ్రహ్మాండాల నాయకుడు అని చెబుతారు. అయితే ఈ లోకాలన్నీ ఒక నాడు ఉంటాయి, ఒక నాడు ఉండవు సృష్టీ ప్రళయాలని బట్టి. భగవంతుడు ఏర్పర్చుకున్న కార్య వైకుంఠం నుంది సృష్టీ స్థితీ లయాలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమైన కారణ వైకుంఠం లేక పరమపదం విరజ అనే నది అవాల ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే నిత్యం అని వ్యవహరిస్తారు. దాన్నే నిత్య విభూతి అని అంటారు. విరజ క్రింద ఉన్నది లీలా విభూతి, విరజ పైన ఉన్నది నిత్య విభూతి. నిత్య విభూతి లీలా విభూతికి మూడు రెట్లు ఉంటుంది. అందుకే 'త్రిపాద్ నిభూతి' అని చెబుతారు. లీలా విభూతికి ఎంత క్రిందకు వెళ్ళినా అంతం ఉండదు. నిత్య విభూతికి పైన అంతం ఉండదు. అందుకే పరమాత్మకి ఉభయ విభూతి నాయకుడు అని పేరు. విభూతి అంటే సంపద అని అర్థం.


ధర్మం అంటే ఏమిటో మన వేదాలు చెబుతున్నాయి. అవి మనకు అన్నిలోకాలలో మనకు సుఖాన్ని ఇస్తాయి. "ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః"
ఎతః - ఏది ఆచరిస్తే
అభ్యుదయ - విరజ ఈవల ఉన్న లీలా విభూతిలో ఉన్నతి
నిశ్శ్రేయస - విరజ ఆవల ఉన్ననిత్య విభూతిలో ఉన్నతి
సిద్దిః - లభిస్తుంది.
సహ - అట్లా లభింపజేసే ఆచరణ లేక సాదనమును 
ధర్మః - ధర్మం అని అంటారు.
ధర్మం అనేది చెప్పేది కాదు. అందరూ తప్పక ఆచరించాల్సింది. ఎందుకు తప్పని సరిగా ఆచరించాలి. మనంతట మనం ఒకరికి హాని చేయక  మన దారిన మనం బ్రతకుతున్న వారు కూడా ధర్మాన్ని ఆచరించాలా, అలా బ్రతికితే చాలదా ? అనేది కొందరి ప్రశ్న. అది సరియైనదే, కానీ మనం పొందాల్సిన అసలు ఫలం కూడా ముఖ్యమే కదా. అది కూడా ఆలోచించుకోని బ్రతకాలి. అయితే మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషం వంటివి మనం ఎంత కాదన్నా తప్పక కలుగుతుంటాయి. ఒక చెట్టు తాను ఏమి ఆశించక లోకానికి ఎంత ఉపకారం చేస్తుంది. మనం కనీసం ఒక చెట్టు చేస్తున్న ఉపకారం అయినా చేస్తున్నామా. అట్లా చూస్తే మనిషి చెట్టుకంటే ఎంతో చేయగలడు, అట్లా చేయక ప్రకృతిలోని ఎన్నింటినో మనం వాడుకుంటున్నాం, అప్పుడు మనం ప్రకృతిని దొంగలించినట్లే కదా లెక్క. మనిషి యొక్క యోగ్యత చెట్టు కంటే చాలా గొప్పది. అది ఆలోచించి బ్రతకాల్సిన భాద్యత మనిషిది. అట్లా మనిషి ఆచరించాల్సినదే ధర్మం అంటే. ఆధర్మాన్నే మన ఋషులు ఆచరించి మన వరకూ అందించారు. ఎలా తెలియాలి ధర్మం అంటే 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదంలోని ప్రతి అక్షరం ధర్మాన్ని చెప్పడానికే.
  
అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు.