Thursday, August 2, 2012

సనాతన వైదిక ధర్మం - 4

మన వాఙ్మయాల గొప్పతనం గుర్తించాలి


పాశ్చాత్యులు మన దేశంపై దాడి చేసినప్పుడు వారికేం పెద్ద సంస్కృతి అంటూ లేదు. ఇక్కడివారి బట్ట కట్టే విధానాన్ని, ఆహారం తయారుచేసుకొనే విధానాన్ని, మన జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి స్థితిలో అడుగుపెట్టి ఈనాడు మనకు వారే అన్ని నేర్పినట్టు వారు చూపిస్తున్నారు. మనం వారు చెప్పినది ఒప్పుకుంటూ, వారి మోచేతి గుండా కారే నీటిని త్రాగడానికి అలవాటు పడ్డ బానిస ప్రవృత్తి మన నరనరాలలో నిండుకొని ఉంది ఈ నాటికీ. ఇది జరిగి మూడు నాలుగు వందల సంవత్సరాలు కూడా గడవలేదు కానీ కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రని మరచి వారు చెప్పిందే చరిత్ర అని నమ్ముతూ వస్తున్నాం. మనది సిందూ నాగరికత అని చెప్పి, మనకంటూ ఉన్న పేరుని, సంస్కృతిని మరచి వారు చెప్పినదే పాట అన్నట్టు బ్రతుకుతున్నాం.

మనమేమిటి అనేది మనం మరచినా, మన పరంపర ఏమిటి అనేది చెప్పే మన గ్రంథాలు ఉన్నాయి. అది మన అదృష్టం. పాశ్చాత్యులు ఎన్నో గ్రంథాలను నామ రూపాలు లేకుండా కాల్చిపాడేసినా ఇంకా మనకు ఎన్నో గ్రంథాలు మనవరకు అందాయి. ఆ లభించిన గ్రంథాలు చెబుతున్నాయి, విమానాలని తయారుచేయడంలో కానీ, రకరకాల విజ్ఞాన విషయాలని కలిగి ఉన్న ఈ దేశం వెనకపడ్డ దేశం కానే కాదు అని.  ఈ నాడు ఇంత విజ్ఞానం కలిగి ఉన్నా చర్మంలోని పొరలని రెండు మూడు పొరలుగానే విడదీయగల్గుతున్నారు. చరకుడు అనే మన శాస్త్రజ్ఞుడికి ఏనాడో చర్మాన్ని ఏడు పొరలుగా విడదీసేంత శస్త్ర చికిత్స నైపుణ్యం ఉందేది. ఈనాడు ఉండే భూగోళ ఆకృతిని అంత స్పష్టంగా చెప్పగలిగాయి మన శాస్త్రాలు అంటే ఆనాడు ఎంత విజ్ఞానం ఉండేదో ఊహించవచ్చు.

అయితే ఈ దేశం మీద దాడి చేసిన వారు ఇక్కడి గంథాలను నాశనం చేసి, మన విజ్ఞానాన్ని దొంగలించి, మన వైజ్ఞానికులని ఊచకోత కోసి, సంపదలని దోచుకొని పోయి, ఇక్కడివారిని బానిసలుగా మార్చడం చేత మనం మనవద్ద అలాంటి విజ్ఞానం ఉండేది అని చెప్పుకొనే అవకాశం లేని స్థితి ఏర్పడింది. మరి అంత విజ్ఞానం ఉంటే ఏమైంది, ఈనాడు వారు చూపించిందే మనం అనుభవిస్తున్నాం కదా అని అనిపిస్తుంది. ఒకసారి మన విజ్ఞానాన్ని ఒక తరంలో నాశనం చేస్తే, ఎన్ని వందల తరాలు కావాలో తిరిగి సంపాదించుకోవడానికి. నాశనం చేయడానికి ఎంతో కాలం పట్టదు. మన విజ్ఞానాన్ని నాశనం చేయడమే కాదు, ఆ వ్యక్తులని కూడా ఊచకోత కోసిన సంఘటనలు మన దేశ చరిత్రలో ఎన్నో ఉన్నాయి.

ఈ నాడు మనం చూస్తున్న సైన్స్ పాశ్చాత్యులు మనపై దాడి చేసిన తరువాతే ఎందుకు అభివృద్ది చెందింది ? అంత విజ్ఞానమే వారికి ఉంటే మరి అంతకు ముందు ఏమైంది..? ఇక్కడినుండి  విజ్ఞానాన్ని, సంపదలని దోచుకొని వారు తయారుచేసినట్లు చూపిస్తున్నారు. సంస్కృతంలో ఉన్న భరద్వాజ విమాన శాస్త్రాన్ని పారిస్ లో లభిస్తే మన వాళ్ళు ఇప్పుడు అచ్చు వేయించారు. అట్లా మన విజ్ఞానం అనేది దోచుకొని వెళ్ళారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ.
మన వద్ద దొంగిలించి ప్రపంచానికి మేం తెలియజేసాం అని చెబుతున్నారు. మన దేశంలో తయారయ్యే బియ్యానికి పేటేంట్ రైట్స్ వారికి ఉన్నాయి. బాసుమతి బియ్యానికి పేటెంట్ వారివద్ద ఉంది ఈ నాడు. రేపు ఒకనాడు మనకు అన్నం ఎట్లా తినాలో మేమే తెలిపాం అని చెబుతారు. మనం ఓహో అని నమ్ముతాం. మనం కాదు అన్నా, మన మాట చెల్లు బాటు కాదు. ఆ అన్నాన్ని ఎట్లా వండుకు తినాలి అని సంస్కారం తెలియని వారికి ఆ బియ్యం పై పేటెంట్స్ అవసరమా..? కోతి నుండి మనిషి పుట్టాడు, ఒకనాడు పచ్చి మాంసం తిన్నాడు, క్రమేపి అగ్గిని కనిపెట్టి వండుకు తిన్నాడు అని చెప్పేవారు వాళ్ళు. ఆ అన్నంతో పులిహోర, పొంగలి వంటి ఎన్నో రకరకాల రుచికరమైన పదార్థాలు, బియ్యపు నూకతో, బియ్యపు పిండితో ఎన్నో రకాల పదార్థాలు చెయ్యడం మనకు కొన్ని వేల సంవత్సరాల నుండే తెలిసిన వాళ్ళం మనం. మన ఆలయాల్లో దేవునికి ఆరాధన క్రమం తెలిపేవి, నైవేద్యం ఎట్లా పెట్టాలో తెలియజేసే వాటిని మనం ఆగమ సంహితలు అంటారు. అందులో మనం చేసే వంటలు ఎట్లా చేయాలో తెలుపుతాయి. అందుకే మన ఆలయాల్లో ప్రసాదాలు రుచి గా ఉంటాయి అవి ఆగమ పద్దతుల ద్వారా చేసేవి కాబట్టి. ఇదీ మన వాఙ్మయాల గొప్పతనం.
ఇంకా అదృష్టం కొద్ది ఉనికిని కోల్పోలేదు. మనలో ఇంకా ఆశావాద ప్రవృత్తి ఉంది. అన్ని రంగాల్లో మన నైపుణ్యాన్ని అందరూ గుర్తించే స్థితిలో ఉన్నాం. మనం అభివృద్ది మార్గంలో ఉన్నాం అనే విషయంలో ఏం సందేహం లేదు. మన సంస్కృతి, మన శాస్త్రాల గొప్పతనాన్ని గుర్తిస్తే మనకు వాటిపై విశ్వాసం ఏర్పడుతుంది.

వేద విభజన - రక్షణ వ్యవస్థ


వేదాల్లో చాలా శాఖలు ఉన్నాయి. వాటి సంఖ్యలు 1131 శాఖలు అని చెబుతారు. స్థూలంగా వాటిని నాలుగు భాగాలుగా వేదవ్యాస భగవానుడు ఏర్పాటుచేసాడు. అంతకుముందు ఆయా లక్షణాలతో వేరే వేరే భాగాలుగా ఉండేవి. అందులో ఒక లక్షణమైన వాటిని ఋక్కులని, ఒక లక్షణం కల్గిన వాటిని మంత్రభాగం క్రింద యజస్సు అని, ఒక లక్షణం కల్గిన వాటిని గానాత్మకంగా సామం అని, మరికొన్నింటిని ఆదర్వణం అని ఇలా పేర్లతో ఆయా ఒక్కో భాగాన్ని ఒక్కో శిష్యుల ద్వారా పదిలపర్చడానికి వారికి అందించి, ఇక వారి ప్రశిష్యుల ద్వారా మరిన్ని ఉప శాఖలుగా విభజించి వాటి రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసినట్టుగా మన శ్రీమత్ భాగవతాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి.
మొదట ఈ నాలుగు వేద రాశులని ఒక్కో వ్యక్తి అధ్యయనం చేసే స్థితి ఉండేదేమో, కానీ వేదవ్యాసుని సమయానికే కొంత సందేహం ఏర్పడింది. వేద వ్యాసుని కాలంలో కౌరవుల ప్రవృత్తి గుర్తుకు చేసుకుంటే తెలుస్తుంది. ద్రౌపతి సామాన్యురాలు కాదు, ఒక మహారాణి, అట్లా వారు ఆమెని సభా మధ్యంలోకి తీసుకొచ్చి అవమానం చేయడం అనేది ఎంత దిగజారుడు స్థితి అనేది అర్థం అవుతుంది.  రాన్నున్న కాలంలో ఈ మాత్రం నిలబెట్టుకొనే సామర్థ్యం మనుష్యులలో ఉండకపోవచ్చుననేమో ఆయన తన శిష్యుల ద్వారా వాటిని పరిరక్షించే వ్యవస్త ఏర్పాటు చేసి ఉంటాడు. సూర్య ఉదయం చాలా మెల్లగా ఉంటుంది, అదే సూర్య అస్తమయం చాలా వేగంగా ఉంటుంది. అలాగే మనుష్యులలో ధార్మిక ప్రవృత్తి అనేది ఎంత వేగంగా దిగజారుతుందో మనకు తెలుస్తుంది. ఆధునిక వైజ్ఞానిక ప్రవృత్తులు సమాజాన్ని ఎంత త్వరగా దిగజార్చాయి అనేది కూడా గమనించవచ్చు. ఆధునిక వైజ్ఞాన శాస్త్రం పెరిగింది 16 వ శతాబ్దం నుండే, అయితే దాని వల్ల మంచి జరిగింది కానీ ఎన్నో వేల సంవత్సరాల నుండి వస్తున్న ప్రకృతి చిన్నా భిన్నం అవడంకూడా అప్పటి నుండే మొదలైంది. అయితే వ్యవస్త చిన్నా భిన్నం అవడం ఎంత త్వరగా జరుగునో మనకు దీన్ని గమనిస్తే తెలుస్తుంది.


అయితే ఈ వేదం అంతా ఒకే రాశి క్రింద ఉండేది, ఒక వ్యక్తి అంతటినీ అధ్యయనం చేయగలిగే వారని మనకు రామాయణంలో తెలుస్తుంది. రాముడు మొదటిసారిగా హనుమను కలిసినప్పుడు, హనుమ రాముణ్ణి కొన్ని ప్రశ్నలు వేసాడు, ఇది పది పదిహేను శ్లోకాలుగా రామాయణంలో ఉంది. ఆ ప్రశ్నలకు బదులుగా రాముడు లక్ష్మణ స్వామితో హనుమ గూర్చి ఇలా అన్నాడు "నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణః నా సామవేద విజుషః శక్యమేవం ప్రభాశితుం" ఈయన మాట్లాడే మాటలు ఎంత బాగున్నాయి చూసావా, చంపివేద్దాం అని వచ్చినవాడికి కూడా ఈయన మాటలు వింటే కత్తి దించివేస్తాడు, ఆ సామర్థ్యం ఈయన మాటల్లో కనిపిస్తుంది. ఋగ్వేదపు, యజుర్వేదపు, సామవేదపు నియంత్రణ కచ్చిత్తంగా కనిపిస్తుంది. అంటే ఆవేదాధ్యయనం చేసినవ్యక్తిలో ఏర్పడే పూర్ణత ఈయనలో కనిపిస్తుంది. ఆంటే ఆ కాలంలో మొత్తం వేద రాశిని నేర్చేసామర్థ్యం ఉండేదని మనకు కనిపిస్తుంది.

అయితే ఆ యుగాలు గడిచి ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి అందుకే వేదవ్యాసుడు ఆ మొత్తం వేద రాశిని కొన్ని శాఖలుగా విభజించవలసి వచ్చింది. అవి మొత్తం 1131 శాఖలు అని చెబుతారు. అందులో సామవేదానికే 1000 శాఖలు, యజుర్వేదానికి 101 శాఖలు, అదర్వవేదానికి 9 శాఖలు, ఋగ్వేదానికి 21 శాఖ అని అంటారు. అలా శాఖలుగా చేసి వేద విజ్ఞాన పరిరక్షణ చేసారు. మన కాలం దాకా వచ్చే సరికి అందులో కేవలం 11 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి. 1000 శాఖలు కల సామవేదంలో కేవలం 4 శాఖలు మాత్రమే కనిపిస్తున్నాయి, యజుర్వేదంలో 101 కి బదులు 4 శాఖలు, ఇక అదర్వవేదంలో 2, ఋగ్వేదంలో 1 శాఖ మాత్రమే ఈనాడు మనకు కనిపిస్తున్నాయి. మిగతా శాఖల పేర్లు మాత్రం తెలుస్తున్నాయి కాని ఆ శాఖలు ఏమిటో ఎవ్వరికీ తెలియదు.

అయితే వేదం అనేది మన ధర్మ శాస్త్రాలలో, ఇతిహాసాలలో, పురాణాది గ్రంథాలలో విస్తరించి ఉంది. వాటి ద్వారా మనం వేద సారాన్ని దర్శించే అవకాశం ఉంది. అట్లా మనం వేదం చెప్పిన విషయాలను తెలుసుకుంటూ, వాటిని ఆచరిస్తూ ప్రయాణిస్తే మన జన్మకి సార్థకత ఏర్పడుతుంది.

వేదం - నాలుగు భాగాలు


వేదాలు మంత్రాల రూపంలో ఉంటాయి. 'మన్' ఎవరైతే వాటిని మననం చేస్తారో 'త్ర' వారిని కాపాడేవి మంత్రాలు అని అంటారు. ఆ మంత్రాల లక్షణాలను బట్టి ఒక్కో పేరుతో వ్యవహరిస్తారు.
వేదం అంటే విజ్ఞాన శాస్త్రం. మన చుట్టూ ఉన్న ప్రకృతి లో ఎన్నో శక్తి విశేషాలు ఉన్నాయి. మనం బ్రతకాలంటే నీరు కావాలి, గాలి కావాలి, నిప్పు కావాలి, ఇలా ఎన్నో ఉంటే తప్ప మన జీవనం గడవదు. మనం తినే ఆహారం తయారు అవ్వడానికి ఈ భూమి సహకరించాలి. మట్టి ఒక్కటి ఉంటే సరిపోదు, సూర్యరశ్మి సోకితేనే అవి పెరిగి మనకు ఆహారంగా కాగలవు. నీరు వర్ష రూపకంగా అందాలి. మనకు అనారోగ్యం చేస్తే కావల్సిన ఔషదాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉంటాయి. ప్రకృతి లోని శక్తి విశేషాల గురించి తెలిపే వాటిని ఋగ్వేదం అని అంటారు.
ఆ శక్తి విశేషాలను పొందాలంటే మనం కొంత చేయాల్సి ఉంటుంది. ఒక చెట్టుని పెంచాలంటే ముందు నేలని తవ్వాలి, శుద్ది చేయాలి, ఒక విత్తనాన్ని నానబెట్టాలి, అది మొలకెత్తాలి, అప్పుడు మొక్కను నాటి పెంచుతాం. ఏది ముందు చేయాలో, ఏది తరువాత చేయాలో అంటూ ఒక పద్దతి ఉంటుంది. ఇలా మనం ఫలితాన్ని పొందాలంటే ఏమేమి ఎట్లా చేయాలో నియమాలని తెలిపేది యజుర్వేదం.
మనం ఏదైనా కోరినప్పుడు మన చుట్టూ ఉన్న శక్తి విశేషాలని వాడుకుంటాం. అవి మనకు సహకరించాలి అంటే మనం వాటిని ఎట్లా పూజించాలి. వాటిని మెప్పించడానికి గానాత్మకంగా ఉన్న వాటిని సామ వేదం అని అంటారు.
  
ఋగ్వేదంలో చెప్పే విషయాలు ఎక్కువగా పరలోకానికి సంబంధించినవి ఉంటాయి. మనకు ఇహలోకం మరియూ పరలోకం రెండూ ప్రధానమే. ఈ లోకంలో  ఉండగా కొన్ని ఫలితాలు మనం కోరుకుంటాం. అట్లా మనం ఆచరించాల్సిన నియమాలు, పద్దతుల గురించి చెప్పే వాటిని ఆదర్వణ వేదం అని అంటారు.
అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు.

(ఇంకా ఉంది)

2 comments:

  1. * చక్కటి విషయాలను వ్రాస్తున్నారు.

    * మన దేశం నుంచి ఎన్నో విలువైన గ్రంధాలను తీసుకువెళ్ళటంతో పాటూ ఆ గ్రంధాలలోని విషయాల గురించి క్షుణ్ణంగా తెలిసిన కొందరు పండితులనూ తీసుకువెళ్ళారంటారు.

    * అక్కడకు వెళ్ళిన పండితుల తరువాతి తరాల వారు కొందరు ఇప్పటికీ అక్కడ ఉండే అవకాశం కూడా ఉంది.

    అయితే , వాళ్ళు అక్కడి వారితో వివాహసంబంధాల వల్ల అక్కడి వాళ్ళుగా అయిపోయి ఉంటారు.

    * వారి వద్ద ఆ పురాతన గ్రంధాలు ఇప్పటికీ ఉండవచ్చు. ఉండకపోవచ్చు.

    ఇవన్నీ ఆలోచిస్తే ఇలా చిత్రమైన ఆలోచనలు వచ్చాయండి.

    ReplyDelete