Thursday, November 17, 2016

సనాతన వైదిక ధర్మం - 8

వేదాన్ని ఖండిస్తూ వచ్చిన నాస్తిక దర్శనాలు

ఎంతో కాలం నుండి వేదాన్ని ఆచరించేవారు ఉన్నట్లే, కొందరు వేదాన్ని అంగీకరించని వారూ ఉండేవారు. వారికి కలిగిన జ్ఞానం ద్వారా విషయాలను తెలిపేవారు. వారు తము గుర్తించిన జ్ఞానాన్ని తమ శిష్యులకు అందించేవారు. అట్లాంటి సంప్రదాయాలు కూడా వేద సంప్రదాయానికి సమాంతరంగా సాగుతూ వచ్చేవి. వాటినే దర్శనాలు అని అంటారు.
ఇవన్నీ ఎప్పటినుండో ఉన్నాయి. ఒక్కోక్కరి ఆలోచనా దోరణి. ఒక్కో కాలంలో కొందరు దర్శించి వెలికి తీసి చూపిస్తారు. అట్లాంటి దర్శనాలలో కొన్ని నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి. సిద్దాంతాలలోని ఆలోచన ధార మంచికోసమే అయి ఉంటుంది, కానీ ఆచరణ ధారలో తప్పు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆయా కాలాన్ని బట్టి ఒక్కో సిద్దాంతం వెలుగులోకి వస్తుంది.
 
నాస్తిక దర్శనాలు ఆరు. చారువాక, జైన మరియూ నాలుగు బౌద్ద దర్శనాలు.

చారువాక దర్శనం:


అట్లాంటి దర్శనాలలో మొదటిది చారువాక దర్శనం. 'చారు' అంటే అందమైన అని అర్థం. వాక్కు అంటే మాటలు. అంటే అందమైన మాటలు అని అర్థం. అవి చూడటానికి అందరికి నచ్చేలా ఉంటాయి. ఒక కాలంలో వేదాన్ని కేవలం కర్మ కాండల కోసమే వాడి, ప్రజలని మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. వేదం అనేది లోక ప్రయోజనాల కోసం, కానీ కొందరు తమ తమ స్వార్థానికోసం వాడటం మొదలు పెట్టారు. ఇది మనం ఈనాడు కూడా అక్కడక్కడ చూడవచ్చు. భగవంతుని పేరిట ఆలయాల నియమాలను మార్చేవారు ఉన్నారు, ఆలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేవారు ఉన్నారు. ఈ నాడు అందరి దేవతలను కలిపి దేవాలయాలు కడుతున్నారు, ఏనాడైనా మన పురాతన ఆలయాలు అట్లా కనిపిస్తాయా. వేదాలు ఉన్న దేవతలను వారిని ఆరాధించే పద్దతులు తెలుపుతాయి. ఎవరెవరి జ్ఞాన స్థాయిని బట్టి వారు కోరిన దేవతలని వారు ఆరాధించేవారు తప్ప స్వంత ప్రవృత్తులు చేర్చడం సబబు కాదు. మన పూర్వుల కంటే గొప్ప తెలివైన వారి మని ఈ నాటి వారి అభిప్రాయం. వారి జ్ఞానంలో ఎంత పాటి జ్ఞానం కలవారు వీరు ఒక్కసారి ఆలోచించాలి. అట్లా వైదిక సంప్రదాయాలు తప్పు దారిన నడిచే సమయంలో బృహస్పతి అనే ఋషి చారువాక దర్శనాన్ని అందించాడు. ఇది నాస్తిక దర్శనం. వైదిక ధర్మంలో మరణించినవారికి కర్మలు అనేవి చేస్తుంటారు. అట్లా చేస్తే అవి వారికి అందుతాయా అని వారికి తోచిన తర్కాన్ని చెబుతే, అది మనకు శ్రమ తగ్గించేవిలా ఉంటాయి. అట్లాంటి అందంగా అనిపించే మాటలే చారువాక అంటే. అయితే వారి దృష్టి వేదం వరకు ఉండదు, కేవలం ప్రత్యక్ష ప్రమాణం, అంటే కనిపించిన దాన్నే నమ్ముతారు. ఎప్పుడైతే వైదిక ధర్మం పూర్తిగా తప్పు దారి నడిచినప్పుడు ఇది అవసరమైంది.

జైన దర్శనం:


కేవలం కనిపించే దాన్నే మాత్రం కాదు నమ్మడం, ఆత్మ అనేదాన్ని కూడా నమ్మాలి అని చెప్పేది జైన దర్శనం. మహావీర్ జైన్ అనే మహానుభావుడు ఈ దర్శనాన్ని అందించాడు. ఆత్మ ఈ శరీరంలో చిక్కి ఉంటుంది కనుకనే శరీరం పని చేస్తుంది, అది వదిలి పెట్టాక పైకి గతి సాగిస్తుంది అని ఈ దర్శనం చెబుతుంది. కనిపించని దాన్ని కొంత వరకు అంగీకరిస్తుంది ఈ దర్శనం.


బౌద్ద దర్శనం:


ఆపై బౌద్ద దర్శనం నాలుగు రకాలుగా వచ్చింది. వారు కనిపించిన దాన్ని కూడా నమ్మరు. కేవలం ఊహను మాత్రమే నమ్ముతారు. మనం చూసే ఈ ప్రకృతి ఇవన్నీ రోజు రోజుకి మార్పు చెందుతున్నాయి, కనుక వాటిని నమ్మరు. జగత్తు అంతా మారుతుంది కనక ఇది అనిత్యం, అనిత్యం కనుక అసత్యం అని చెబుతారు. అసత్యం కనుక జగత్ అంతా మిథ్య అని వారి అభిప్రాయం. మోక్షం అంటే దీపం ఆరిపోయినట్లు, ఆత్మ వినాశం అని నమ్ముతారు. ఆకాలంలో వేదాన్ని ఆచరించే వారు తప్పుడు దోవలో ఉన్నందుకు, అట్లాంటి మార్గం నుండి తప్పించాల్సి వచ్చింది, దైవాన్ని నమ్మి తప్పులు చెయ్యడం అనేది గొప్ప అపచారం. అందుకే ఇలాంటి నాస్తిక సిద్దాంతాలు బయలుదేరాయి. ఒక గోడ కడుతుంటే అది వంకరగా వస్తే కూల్పి కటాల్సిందే, అట్లానే సరియైన వేద ఆచరణని స్థాపించడానికి, ముందు ఆచరణలో ఉన్న తప్పుడు సంప్రదాయాలని తొలగించాల్సిన అవసర ఏర్పడింది. తరువాత వైదిక సిద్దాంత పునర్ స్థాపన కొరకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఈ సిద్దంతాన్ని ఖండించారు. వేదంలోని తప్పును సరి చేయడానికి వచ్చిన సిద్దాంతాలు. వారు మంచినే కోరారు. సంఘంలో శాంతిని నెలకొలిపాలి అనేది వారి లక్ష్యం. కానీ దురదృష్టకరం ఈనాడు వారు చేసే జీవ హింస, బ్రతికి ఉన్న జీవులని అట్టే తినే సంప్రదాయాలు తయారు అయ్యాయి.

Wednesday, November 16, 2016

సనాతన వైదిక ధర్మం - 7

వేదవ్యాసుడు ప్రతిపాదించిన 'బ్రహ్మ సూత్రాలు'


వేదాన్ని వివరంగా తెలిపే గ్రంథాలను అంగీకరించేప్పుడు వేదానికి విరుద్దంగా లేని వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. కపిలుడు, బుద్దుడు భగవంతుని అవతారాలైనప్పటికీ వారు చెప్పినవి ప్రామాణికం కాదు. కపిలుడు చెప్పిన విషయాలు కేవలం ప్రకృతి గురించి మాత్రమే, బుద్దుడు చెప్పిన విషయాలు ఊహ లేక అనుమానం వరకే అందుతాయి. అవి ఆయా కాల పరిస్థితులను బట్టి చెప్పినవే కానీ, వాస్తవాలు కావు. వేదాన్ని ఆచరించేవారు వాటిని ఖండిస్తారు.

వేదాల విషయానికి వస్తే ప్రతి వేదంలో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు మరియూ ఆరణ్యకాలు. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. వేద వ్యాసుడు మహాభారతాన్ని వ్రాసే సమయంలో ఎందరో ఋషుల మధ్య ఎన్నో సందేహాలు ఉండేవి. ఒక్కో ఉపనిషత్ కొన్ని విషయాలను తెలుపుతాయి కనుక. వారు ఒకచోట కలిసినప్పుడు చర్చించేవారు. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండేవి. వారి అందరి కోరిక కేవలం వాస్తవాన్ని శోదించడం, తరువాత తరాల వారు బాగుపడటానికి విలువైన విషయాలను అందించడం. అందుకే వారిని గొప్ప శాస్త్రజ్ఞులు అని అంటారు. వారికి ఉన్న శ్రద్ద అట్లాంటిది. ఇంద్రుడు కూడా ప్రజాపతుల ఆశ్రమాలలో ఎనూట ఇరవై సంవత్సరాలు గడిపాడు అని తెలుస్తుంది. ఎవరికి తోచినట్లు వారు చెప్పడం కాక, వారి చర్చలు వేదాలను అనుసరించి ప్రామాణికంగా ఉండేవి.

అట్లా వారికి ఏర్పడ్డ సందేహాలను, భిన్న భిన్న అభిప్రాయాలను తొలగించేందుకు వేదవ్యాసుడు లోకంలో అన్ని చోట్ల నుండి ఋషులని పిలిపించి పెద్ద సత్రాన్ని ఏర్పాటుచేసాడు. ఒక పెద్ద యాగం జరిగింది. దానికే 'సత్రయాగం' అని పేరు. కొన్ని సంవత్సరాలు జరిగింది ఆ యాగం. ఆరాధన చేయగానే అందరూ చర్చ జరిపేవారు. అందులో ఒక్కొక్కరు వారికి అర్థం అయ్యింది తెలిపేవారు. దాన్ని తీసుకొని అందరూ తమ తమ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తెలిపేవారు. అందరూ కలిసి ఒక సారాంశాన్ని తేల్చేవారు. అది వేదానికి అనుగుణంగా ఉండేది, అందరి సంశయాలని తొలగించేది. ఆరణ్యకాలలోని ఉపనిషత్తుల సారంగా, ఆ సత్రయాగం జరిగిన సమయంలో ప్రతిపాదించబడ్డ విషయాలనన్నింటినీ వేదవ్యాసుడు ఒక సారాంశంగా వ్రాసాడు. వాటినే బ్రహ్మ సూత్రాలు అని అంటారు. అందులో 545 సూత్రాలు ఉంటాయి. అందులో ఆత్మ యొక్క గతి, దాని ప్రయాణం ఎట్లా సాగుతుంది, మానవ జన్మకి ఎట్లా వస్తుంది, లేక మరొక జన్మకి ఎట్లా వెళ్తుంది, మనిషి బ్రతకడానికి అవసరమైన విధులు అన్నీ ఉంటాయి. మనిషి యొక్క శారీరక విధులైన దంతదావన-దంతాలు శుభ్రపరచుకోవడం, జిహ్వాలేకనం -నాలుక శుభ్రపరచుకోవడం, గండూషణం - నోరు పుక్కిలించడం, స్నానం ఆచరించడం, దైవారాధన, అల్పాహారం తీసుకోవడం ఇలామనం లేచిన సమయం మొదలుకొని తిరిగి రాత్రి విశ్రాంతి తీసుకొనేంత వరకు మనం చేయాల్సిన ప్రతి ఒక్కటీ ఎట్లా క్రమంగా చేయాలో తెలుపుతాయి. దీన్నే సామాన్య శాస్త్రం అని అంటారు. 



మహాభారతంలోని భగవద్గీత, వేదాలలోని ఉపనిషత్తులు మరియూ బ్రహ్మ సూత్రాలు, ఈ మూడింటి ఆధారంగానే మన ఆచార్యులు సంప్రదాయాలను లేక సిద్దంతాలను స్థాపించడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైదిక సంప్రదాయాలు ఇట్లా ఏర్పడ్డవి అనేది గుర్తించాలి.