Sunday, July 29, 2012

సనాతన వైదిక ధర్మం -3

సృష్టి అంతా వేద శబ్దంచే సృజించబడినది

 
వేదం అనేది విజ్ఞాన శాస్త్రం. కొంత తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.  మను అనే మహర్షి వేదాన్ని గురించి ఇలా చెప్పాడు.  "వేద శబ్దేభ్య ఏవాతౌ దేవా దీనం చకార సహ"

సహ- ఈ జగత్తుని సృజించినవాడెవడో జగత్ కారణమైనటువంటి వాడొకడున్నాడు. ఈ విషయం అందరూ అగీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే "For Every Effect there must be some Cause". మనం ఇప్పుడు చూస్తున్న ఈ జగత్తు అంతటికీ ఒక కారణం అనేది ఉండాల్సిందే. దాన్నే మనం కారణ తత్వం అందాం. ఈ జగత్తులో ఎన్నో విషయాలు చూస్తున్నాం, ఇవన్నీ ఒకదాని తో ఒకటి ముడి పడి ఉన్నాయి.

ఆ కారణ తత్వం వీటన్నింటినీ నడుపుతుంది. మన పెద్దలు "కారణంతు ధ్యేయః" ఆ కారణాన్ని తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతారు. ఆ తత్వం ఎక్కడో ఒక చోట ఉంటుంది అని చెప్పనవసరం లేదు. ఎందు కంటే మనం చూసే ప్రతి అణువణువు ఎంత క్రమబద్దమై ఉంటుంది కావున అది అంతటా వ్యాపించియే ఉంటుంది. ఇంతటినీ తయారు చేసిన ఆ కారణ తత్వం చాలా శక్తివంతమైనది, అన్నింటినీ నియంత్రించ గలదై ఉండాల్సిందే లేకుంటే దీన్నంతా ఆధీనంలో పెట్టుకోవడం అంత సులువుకాదు.  నియంత్రించడం అనేది పురుష స్వభావం అయితే ఇక దయ, క్షమ, ఓరిమి, జాలి ఇవన్నీ స్త్రీ స్వభావం అని అనుకోవచ్చు. అందుకే ఆయనలోని ఈ నియంత్రించే స్వభావన్ని బట్టి మను అనే మహర్షి "సహ" అంటే అతడు అని వ్యవహరిస్తాడు.

మరి కేవలం నియంత్రించే తత్వమే ఆ జగత్ కారణ తత్వానికి ఉంటే ప్రమాదం కదా, ఎవ్వరూ దాని దరికి చేరటానికి ఇష్ట పడరు. అందుకే ఆ కారణ తత్వం మొత్తం దయచే ఆక్రమించబడి నిరంతరం ఉంటుంది. వేద భాగమైన మంత్ర పుష్పాల్లో ఈ విషయం చెప్పబడి ఉంది.  "నీలతో యదమధ్యస్తాః విధ్యుల్లేఖేవ భాస్వరః" దయా అనే గుణం ఆయనలో ఒక మేఘాన్ని ఆక్రమించిన మెరుపు తీగవలె, ఆ తత్వాన్ని కప్పబడి ఉంటుంది అని తెలుపుతుంది. అయితే దయ అనేది స్త్రీ స్వభావం అవటంచే స్త్రీ రూపంలో భావన చేస్తుంటారు.  అయితే ఈ నియంతృత్వం లేక శాసితృత్వం మరియూ దయ లో ఏ ఒక్కటీ లేక పోతే పని చెయ్యదు. కేవలం శాసితృత్వం ఉన్నా సరిపోదు, కేవలం దయ ఉన్నా సరిపోదు. అందుకే మన పెద్దలు ఇవి రెండు వేరువేరుగా ఉండవయా, దయ కల్గిన నియంత్రణ ఉన్న వాడే ఈ జగత్ కారణ తత్వం అని చెబుతారు.  వాడు అని చెబుతున్నాం ఎందుకంటే ఆ తత్వం చేతనుడై ఉండాలి, మనకు తెలివి ఉంది మనలాంటి వారిని నియంత్రించే వాడికీ తెలివి ఉంటే తప్ప నియంత్రించడం కుదరదు. అందుకే చేతనుడై ఉండాలి ఆ తత్వం. దయ కల్గి నియంత్రించగలిగేదే ఆ తత్వం "ఏకమేవ అద్వితీయం"అని చాందోగ్య అనే శృతి తెలియజేస్తుంది. ఈ దయ నియంతృత్వం రెంటినీ కల్పి మనం శ్రీమన్నారాయణుడు అని చెబుతాం, అంటే 'శ్రీ' కల్గిన 'నారాయణుడు' అని అర్థం.

"చకార" ఈ జగత్తంతా చాతుర్వర్ణం. చాతుర్వర్ణం అంటే నాలుగు వర్ణాలుగా చెప్పటానికి యోగ్యత కల్గి ఉన్నది. నిలువుగా క్రమ పద్దతిలో నడిచే మానవులం ఒక వర్ణం అయితే, అడ్డంగా నడిచే పశువులూ, పక్షులూ మరియూ క్రిమి కీటాదులు తిర్యక్ అనే ఒక వర్ణం. ప్రాణం ఉన్నా లేకున్నా ఒక వద్ద కదలక పడి ఉండే చెట్లు, రాళ్ళు ఇవన్నీ స్థావరాలు ఇవి ఒక వర్ణం.  


ఇవన్నీ ఇలా పనిచేస్తున్నాయి అంటే వెనకాతల కొన్ని ధివ్యమైన శక్తివిశేషాలు మన బుద్దికి అందనివి కొన్ని ఉన్నాయి. ప్రమిద మనం తేగలం అందులో నెయ్యి పొయ్యగలం, ఇక దూదితో వత్తు పెట్టగలం, ఇక అగ్గిపెట్టెతో అగ్గి పుల్లని గీసి దీపం వెలిగిస్తున్నాం.  మరి అది దేనిలోంచి వచ్చింది అని చెప్పాలి. ఆ వచ్చే వేడి లేక కాంతి వీటన్నింటికన్నా విలక్షణమైన శక్తివిశేషం కలది. దానికి ధివ్యం లేక దేవ లేక సుర అని ఒక వర్ణం గా చెబుతారు. సుర నర తిర్యక్ స్తావర జాతులనే చాతుర్వర్ణం అని అంటారు.
సహ చకార - ఈ నాలుగు వర్ణాలను చేసిన వాడు, దేని చేత ?  "వేద శబ్దేభ్య ఏవ" వేద శబ్దాల చే చేసెను అని చెబుతుంది.
ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది.
 

వేదం నిత్యం


మానవ జాతికి మార్గ నిర్దేశ్యం చేయటానికి ఏర్పడ్డ వాంఙ్మయం వేద వాంఙ్మయం. ఆ వేద వాఙ్మయాన్ని మనం నిత్యం అంటాం. అంటే భూత,భవిష్యత్ మరియూ వర్తమాన ఈ మూడు కాలాల్లో ఒకేలా ఉండేది అని అర్థం. అది నిత్యం కనకనే దాన్ని ఏదో ఒకనాడు ఎవడో ఒకడు వ్రాసినవి కాదు. త్రేతాయుగంలో వాల్మీకి రామాయణాన్ని, ద్వాపర యుగంలో వేదవ్యాసుడు భారతాన్ని వ్రాసెను అని చెబుతాం. కానీ వేద వాఙ్మయాన్ని అలా వ్రాసినది అని చెప్పము.

మనం చూస్తున్న ఈ సృష్టి కొత్తగా ఏర్పడలా, అది జరుగుతూనే ఉంది. మొదట కృత యుగం, ఆ తరువాత త్రేతా యుగం, ద్వాపర యుగం, కలి యుగం, తిరిగి మళ్ళీ ఇక కృత,త్రేతా,ద్వాపర,కలి యుగం ఇలా చక్ర గతిన సాగుతూనే ఉంటుంది. ఇలాంటి 71 చతుర్యుగాలు, గడిస్తే ఒక మను సమయం అవుతుంది. ఒక్క చతుర్యుగం అంటే 43 లక్షల 20 వేల సంవత్సరాలు. ఆ తరువాత రెండో మను సమయం ప్రారంభం అవుతుంది. అలాంటి 14 మంది మనుల సమయం గడిస్తే బ్రహ్మగారికి ఒక రోజు,కల్పం లేక మహా ప్రళయం అంటారు. రోజు ఎంత రోజో బ్రహ్మ గారికి అంత రాత్రి కూడా ఉంటుంది. ఇక ఆయన రోజు ఇలా సాగుతూనే ఉంటుంది. అలాంటి బ్రహ్మకి ఇప్పుడు 50 యేండ్ల ఆయిస్సు గడిచిందని చెప్పవచ్చు.

మనలాంటి మనుష్యులు ఎప్పటి నుండో ఉన్నారు. పాశ్చాత్యులు చెప్పుతున్నట్టుగా ఈ మధ్య కాలంలో జరగలా. ప్రతి యుగంలో ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, బ్రహ్మ, రుద్రుడు, ప్రజాపతులు, ఋషులు ఉన్నారు. ఇవన్నీ పదవులు. వ్యాసుడు, పరాశరుడు ఇవన్నీ పదవులు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు జీవించే వారు. సూర్యుడూ ఒక పదవి. ఈ విషయాలని పాశ్చాత్యులు అంగీకరించకున్నా ఇది వాస్తవం. వాళ్ళు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెబుతారు కానీ అది ఏంటో ఇక పై చెప్పలేరు. మనం ఆ శక్తి విశేషాన్నే భూమాతా అంటాం. ఈ భూమిపై ఎన్నో చైతన్యం కల జీవరాశులు పుడుతున్నాయి, అందుకే మనం భూమికి చైతన్యం ఉంది అంటాం. అట్లా మనం చూస్తున్న ఈ సూర్యుడు పుట్టి 27 చతుర్యుగాలు అయ్యాయి. మనం ఉన్న చతుర్యుగంలో నాలుగో యుగంలో మనం ఉన్నాం. ఈ యుగం మొత్తం 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఇందులో ఇప్పటివరకు దాదాపు అయిదు వేల నూరు సంవత్సరాలు పైగా గడిచాయి.

వేదంలోని జ్ఞాన భాగమైన ఉపనిషత్తులలో మనకు కొందరి ఋషుల పేర్లు కనిపించవచ్చు. అవి వారు దర్శించిన వారు, వారు వ్రాసినవారు కాదు. ఈ మధ్య కాలంలో, అంటే ఈ కలియుగానికి ముందు ఉన్న సమయంలో ఉన్న ఋషులలా అని పించవచ్చు. ఉపనిషత్తులలో కనిపించే ఋషుల పేర్లను బట్టి మన వేదం పుట్టి ఇన్ని సంవత్సరాలు అని చెప్పకూడదు. వేదం నిత్యం. ప్రపంచం అంతా ఒకనాడు భరతవంశానికి చెందినదే
వేదాన్ని మన జాతి తన సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి. మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి.
రామాయణ, భారత కాలాల్లో మతాలు అంటూ ఏమి లేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక మతం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాళ్ళు. మరికొందరు పాటించనివారుండే వారు. అయితే ఆ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి. అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే. ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కందంలో  ఉంది. ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూ భాగం క్రింద ఉండేది ఒక నాడు. అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం" అని కనిపిస్తుంది మనకు. సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది. సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది. మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది. అమేరికాలోని చికాగో లో న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్ష్లల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు. మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం. మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు మేం చెబుతున్నాం అన్నట్టుగా. వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు. మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ భూమిని ఖండాలుగా విభజించిన నాభి అనే చక్రవర్తి ఉన్నాడు. భరత వంశానికి చెందిన వాడు. తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు. వారే ఒక రథాన్ని ఉపయోగించి భూభాగాన్ని జరిపారు అని తెలుస్తోంది.

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవేత్తలూ అంగీకరిస్తారు.ఆస్ట్రేలియా లో ఉత్తర భాగంలో ఉన్న అడవులూ, పక్షులూ మన తమిళనాటి అడవులను, పక్షులను పోలి ఉంటాయి. ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు. అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాటి వారిలాగే ఉంటారు. వారి భాష కూడా అట్లానే ఉంటుంది. అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు. ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే. అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు. అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు. మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరతుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా. అదెలా అంటే, సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి. హింస చేయునది సింహం అంటారు. ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య, అలా కాలిఫోర్నియా అయ్యింది.
 
ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది. అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది. మన పురాణాల లోనికి వారు వెళ్ళలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాళ్ళే చెప్పే వాళ్ళు . ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది. మొత్తం ఆసియా, యూరోప్ ఖండాలు గడ్డిగా, అమేరికా కుందేలుగా కనిపిస్తుంది. దక్షిణ అమేరికా కుందేటి తల, ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం. అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!! అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒక నాడు ఇక్కడి నుండి దోచుకున్నదే. ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాళ్ళకు ఇన్ని విషయాలు తెలియవు.
ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాళ్ళలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు. అందరూ ఆయన పేరు చెప్పుకొనే వారట, అందుకే భారతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది. ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు. అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు, అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం. ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.
దురదృష్ట కరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై, ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాళ్ళలా తయారయ్యాం. ఇవి వాస్తవం అని గుర్తించాలి.

(ఇంకా ఉంది...)

Friday, July 13, 2012

సనాతన వైదిక ధర్మం - 2

వేదం-అనాది నిధనం

 వేదం మనల్ని శాసించగలదు, అందుకే శాస్త్రం అని పేరు. "శాస్త్ర జ్ఞానం భహు క్లేశం బుద్దే శ్చలన కారణం" శాస్త్రాలు అనేకం, శాస్త్రాలను చదివి మనం తెల్సుకోవాలంటే, ఒక్కోటి ఒక్కో రకంగా కనిపిస్తాయి అందులో ప్రతిపాదించిన విషయాలు. అనేక చోట్ల ఒకదానితో ఒకటి వైవిధ్యంగానూ కనిపిస్తాయి. అట్లాంటప్పుడు ఆ శాస్త్రీయమైన గ్రంథాలను చదివి ఆ విషయాలను తెల్సుకోవడం అనేది కష్టం.
 మరి శాస్త్రాలనే ఎందుకు చదవాలి అంటే, మనకు అలౌకికమైన అర్థాలను తెల్సుకోవాలి అంటే శాస్త్రం తప్ప మరొక ప్రమాణం లేదు. ఎందుకంటే మన కున్న ఇంద్రియాలకి శక్తి సంకుచితమైనది. జ్ఞానం కలగాలి అంటే ఇంద్రియాల వల్లనో లేక ఊహించైనా కదా కలగాలి. ఇంద్రియాల వల్ల కల్గాలి అంటే ఇంద్రియాలకి సంపూర్ణమైన శక్తి లేదు. ఎదురుగుండా ఉండే వస్తువులనే మనం ఎన్నింటినో చూడలేం. అన్ని రకాల శబ్దాలని వినగల్గుతున్నామా!! అన్ని ఇంద్రియాలకీ ఉన్న శక్తి చాలా అల్పమైనది. అందుకే ఇంద్రియాల ద్వారా అన్నింటినీ తెల్సుకోలేం. మనం చూసినవాటిని బట్టి కొంత ఊహిస్తాం. దీన్ని అనుమానం అని అంటారు. మనం ఇంద్రియాల బట్టి తెల్సుకున్న దాన్ని మానం అని అంటాం, దీన్ని అనుసరించి కల్గిన జ్ఞానాన్ని మనం అనుమానం అని అంటారు. ఒకటని ఊహించి ఉంటాం, కానీ అది మరొకటి అయి ఉండవచ్చు. లౌకికమైన విషయాలయందే మనకున్న ఇంద్రియల శక్తి సంకుచితం, మన ఊహ అల్పం అయితే మనకు తెలియనటువంటి అలౌకికమైన అనేక విషయాలను గుర్తించడంలో ఇంద్రియాలు కానీ, ఊహ కానీ పనికిరావు.
 వీటిని చెప్పగలిగేది వేదం ఒక్కటే. దీన్నే శాస్త్రం అని అంటారు. దాని ఏరకమైన దోషాలు ఉండవు. సంకుచితత్వం దానికి లేదు కారణం అది ఎవరూ తయారుచేసింది కాదు, ఎవరో కల్పించి వ్రాసినది కాదు. శాస్త్రం అపౌరుషేయం. అంటే జ్ఞానం కల జీవ సామాన్యం కానీ, దేవుడు కానీ  వ్రాసినది కాదు. దేవుడిని మనం గుర్తిస్తున్నాం అంటే శాస్త్రం చెప్పింది కనక గుర్తిస్తున్నాం. మన కంటికి కనిపించాడు కనక నమ్ముతున్నామా, లేదు కదా. ఆత్మను చూసా మనం గుర్తిస్తున్నాం? శాస్త్రం చెప్పింది కనక విశ్వసిస్తున్నాం. వేదానికి ఆది లేదు, అనాధి అని అంటారు. రామాయణాన్ని వాల్మికి త్రేతా యుగంలో వ్రాసెను,  భారతాన్ని వేద వ్యాసుడు ద్వాపర యుగంలో వ్రాసెను అని చెబుతాం. భాగవతాన్ని ద్వాపర అంతంలో బదరికాశ్రమంలో అలకనందా నది, సరస్వతి నది కలిసే కేశవ ప్రయాగ అనే ఒక ప్రదేశంలో ఉన్న పర్వతంపై కూర్చొని వ్రాస్తున్నాను అని వేద వ్యాసుడే చెబుతాడు. అట్లా వేదానికి వ్రాసినవాడు కానీ, ఒక కాలం కానీ లేదు. అందుకే వేదాన్ని నిత్యం అని అంటారు. ఒకప్పుడు గిర్తించబడి ఉంటుంది, ఒక్కోసారి ఎవ్వరూ గుర్తించక మరుగున పడి ఉంటుంది. దాన్ని గుర్తించే వ్యక్తి ఉన్నప్పుడు తిరిగి ప్రకాశిస్తుంది. మన వాతావరణంలో ఎన్నో తరంగాలు ఉంటాయి, ఒక పరికరం పెట్టినప్పుడే కదా అవి మనకు అందుతున్నాయి. పరికరంలేనంత మాత్రాన అవి లేవు అని చెప్పలేం. వేదం అనేది నిత్యమైనది.
ఏదో ఒకరకమైన యోగ శక్తి విశేషం చేత, సాధనా సామర్థ్యం చేత, వారున్న సమాధి స్థితిలో వాటిని గుర్తించారు. వారినే ద్రష్టలు అని అంటారు. కల్పించారు అని చెప్పరు. దర్శించారు అని చెబుతాం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని గుర్తించడానికి ముందు భూమికి గురుత్వాకర్షణ శక్తి లేక పోలేదు. అట్లా వేద శాస్త్రం అనేది ఎప్పటికీ ఉండేది అందుకే అనాది నిధనం అని అంటారు.

వేదం-అపౌరుషేయం

 మనం లోకంలో ఉన్నవాటిల్లో శ్రేష్ఠమైనవేవో వాటిని పొందాలని అనుకుంటాం, పొందినవాటిని నిలుపుకొనే ప్రయత్నం చేస్తాం. దానికి మన శరీరాన్ని, జ్ఞానేంద్రియాలని, ఆలోచనలని, చుట్టూ ఉన్న పరిసరాలను మరియూ మనకు మంచి చెప్పే పెద్దలను తోడు చేసుకొని జీవన యాత్ర కొనసాగిస్తాం. మనం పోదే ఫలితం ఎప్పటికీ నిలిచి ఉండేదై ఉండాలి. వేదాలు మనం కోరుకునే కోరికలు ఎట్లా ఉండాలి, వాటిని పొందాలంటే మన ఆచరించాల్సిన ధర్మం ఎట్లా ఉండాలి, అట్లా చేస్తే వచ్చే ఫలితం తాత్కాలికమా, ఎక్కువకాలం నిలిచేదా లేక ఎప్పటికీ నిలిచేదా అనే విషయలను తెలుపుతాయి.
వేదం అంటే 'వేదయతి ఇతి వేదాః' విజ్ఞాన గని. మనలో జ్ఞానాన్ని వెలిగించేది అని అర్థం. విజ్ఞానం అనేది అర్థవంతమైన శబ్దరూపంలో కలది వేదం. అవి సహజమైన శబ్దాలు. లోకంలో మనం జంతువుల అరుపులు సహజంగా ఉంటాయి, ఒకే రకంగా ఉంటాయి. అయితే అవి జీవ నిర్మితాలు. అట్లానే ఎప్పటికీ ఒకే రకంగా ఉండే సహజమైన శబ్దాలను వేదం అని అంటారు. ఈ విశ్వం యొక్క మూలం ఓంకారమని 'ఓమ్ ఇతి ఏతత్' అని, ఆ ఓంకారం నుండి వెలువడినదే వేదం అంటే. దాన్ని దర్శించిన ఋషులు వారి శిష్యులకు అందించారు. అట్లా ఋషుల మాటల ద్వారానే మన వరకు అందుతోంది. కేవలం వారి నోటి మాటల వలే ఉండేదే తప్ప పుస్తకరూపంలో ఉండేది కాదు, అది వారికుండే మేధాశక్తి అంత గొప్పది. వేదాన్ని ఉచ్చరించే క్రమం ఉంటుంది, ఎవరు నేర్చినా అట్లానే ఉచ్చరించాలి. ఒకరి ద్వారానే నేర్వాలి తప్ప పుస్తకం చూసి నేర్చేది కాదు. దాన్ని మననం చేస్తే మనల్ని రక్షిస్తుంది కనక 'మన్-త్ర' మంత్రాల రూపంలో ఉంటుంది.
అది మనం ఈ నాడు చూసే సంస్కృత భాషలో ఉన్నట్టు కనిపిస్తుంది, ఎందుకంటే సంస్కృత భాష వేద శబ్దాలను ఇమడ్చుకొనేట్టు సుసంస్కృతం చేయబడ్డ భాష. ఆకాలంలో ఉన్న వాడుక భాషలోని కొన్ని పదాలను, వేద శబ్దాలను కలిపి చేసిన భాష సంస్కృతం. లోకంలో ఎన్నో భాషలు మనకు ఈనాడు కనిపిస్తున్నాయి, మరి వేదం ఆ భాషలవారికి చెందినది కాదా అంటే, ఈ నాడు వ్యవహారంలో ఉన్న ప్రతి భాష ఏదో ఒక నాడు సంస్కృత భాష నుండి ఏర్పడ్డవే, భాషా పరిజ్ఞానం ఉన్న వారు చెప్పే విషయం ఇది. వేదం అనేది ఒక భాషకు కూడ అందనిది. ఎందుకంటే భాషలనేవి మనుష్యులు అవసరంకోసం ఏర్పర్చుకున్నవి. వేద శబ్దాల్లోంచి సంస్కరించబడి ఉన్న భాష సంస్కృతం అవడంచే ఆ భాషలో మనకు వేదం కనిపిస్తుంది. భాషలు, అక్షరాలు ఇవన్నీ ఏర్పడక ముందే శబ్దం అనేది ఉంది. వేదాలు అనేవి ఒకరు ఏర్పర్చిన శబ్దం కాదు. సహజ శబ్దాలను మనం వేదాలు అని అంటాం. ఏర్పాటుచేసుకున్న శబ్దాలని మనం భాషలు అంటాం. అయితే వేదాన్ని సహజ శబ్దం అని ఎలా అనగలం అంటే, ఆ శబ్దాలలో ఇమిడి ఉన్న ఆ విధానం అనేది మన భాషా ప్రావిణ్యానికి అందనిదిలా కనిపిస్తుంది కాబట్టి. వేదం విని నేర్వాల్సిందే తప్ప చదివి నేర్చేది కాదు. ఈ ప్రకృతిలో ఇంత విశ్వం తయారుకావడానికి కారణమైన వేద శబ్దాలను మన ఋషులు తపస్సమాధి దశలో వాటిని గుర్తించారు. వాటిని తమ శిష్యులకు అందించారు.
అయితే ఇది శ్రవణ పరంపర. ఉచ్చారణ- అనుచ్చారణ క్రమంగా వేదాధ్యయనం సాగేది. అది విని నేర్చేది కనక శృతి అని పేరుపెట్టారు. పదే పదే ధ్యానించేది కనక ఆమ్నాయము అని అంటారు.
అయితే దాన్ని తెలుసుకుంటే మనకు ఏమడిగితే దాన్ని ఇస్తుంది, తెలిపేది మరియూ కావల్సిన లాభాన్ని ఇచ్చేది కనక వేదం అని పేరు పెట్టారు.భగవంతునికి కూడా అది ఎప్పటిదో తెలియదు కనక దాన్ని నిత్యం అని పేరు పెట్టారు. 
ప్రతి ప్రాణి పురుష విభాగంలోకే చెందుతుంది, ఇక పరమాత్మ కూడా ఉత్తమ పురుషుడు, అంటే ఒక పురుష విభాగంలోకే చెందుతాడు. అందుకే అయన వ్రాసింది కూడా కాదు వేదం. ఎవ్వరూ తమకు తోచినట్లు కల్పించి చెప్పినది కాదు వేదం. అవి ఒక పుస్తకం కాదు అని గుర్తించాలి. ఎవ్వరూ తమకు తోచినట్లు వ్రాసినది కాదు కనక అపౌరుషేయం అని పేరు. ఈ సృష్టి అంతా ఆ వేద శబ్దంచే సృజించబడి ఉంది. ఆ వేద శబ్దం కు అంత శక్తి ఉంది అన్న మాట.
మరి ఏమిటి వేదం ? "యస్య విశ్వసితం వేదాః" వేదాలు భగవంతుని ఊపిరి వంటివి అని చెప్పారు. అయన నిర్ణయించింది కూడా కాదు. ఆయన అనుభవించ కలడు. ఆయన ఎట్లా ఉన్నాడో, వేదాలు అట్లానే నిత్యం ఉంటాయి. 
 వేద శబ్దాన్ని తీసుకొని దీనికి ఇది ఇంత అర్థం అని చెప్పలేం. జన్మ నిచ్చే తల్లిని మనం అమ్మ అని పిలుస్తాం, మరొక భాషలో మా అని, తాయార్ అని ఇలా వివిద శబ్దాలతో పిలుస్తారు. అయితే ఆ వ్యక్తిని చెప్పడానికి ఇన్ని శబ్దాలు ఆ అమ్మని చెప్పటానికే ఏర్పడ్డవి, కానీ ఈ శబ్దాలకి అర్థం అమ్మ అవుతుందా? అమ్మని పూర్తిగా ఈ శబ్దం చెప్పగలదా ? శబ్దం అనేది అనిత్యం, ఇప్పుడు ఉంటుంది, కొంత సమయానికి ఉండదు. ఆయితే ఆ అమ్మ ఎప్పటికి అక్కడ నిలిచి ఉంది. అమ్మలో మార్పు లేదు. ఆ శబ్దంలో కనిపించని ప్రేమ,వాత్సల్యం అనే గుణాలు ఆ అమ్మలో కనిపిస్తున్నాయి. కనుక శబ్దం అనేది చాలా తక్కువ, దాని అర్థం చాల ఎక్కువ. అందుకే వేద శబ్దానికి ఇది అర్థం అని చెప్పడం కష్టం. అలా చెప్పడం సముద్రాన్ని చిన్న పాత్రలో నింపే ప్రయత్నం చేసినట్లే అవుతుంది.
 అయితే ఈ వేదాలతోనే ఇంత సృష్టి జరిగింది కనక సృష్టికి ప్రతి సృష్టి చేయగలగొచ్చు అనడానికి విశ్వామిత్రుడే ఉదాహరణ. మన జన్మకి ప్రవృత్తికి కారణం వేదమే, కేవలం మనమే కాదు ఈ విశ్వం అంతటికీ కారణం వేదమే, తల్లిని ఎట్లా అయితే పూజిస్తామో, కృతజ్ఞత కల్గి ఉంటామో ఆ వేదానికీ మనం కృతజ్ఞత కల్గి ఉండాలి. ఆ వేదం పురాణాల ద్వారా, స్మృతుల ద్వారా ఇలా వివిద రకాలుగా అందవచ్చు కనక వాటిని గూర్చి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం, కానీ అది ఇంతే అని అర్థం కట్టలేం. మనం అదృష్టం మనం ఆ సంప్రదాయంలో ఉన్నాం. వాటిని మనం పరిరక్షించుకుందాం.
(ఇంకా ఉంది...)

Wednesday, July 11, 2012

సనాతన వైదిక ధర్మం - 1

వాస్తవ అన్వేషణ - ప్రమాణాలు


జ్ఞానం కలిగి ఉన్నది మానవ జన్మ. పుట్టడం పెరగడం తరగడం ఇలా ప్రవాహంలా సాగుతుంది జీవన విధానం. మనుష్యులతో పాటు చుట్టూ ఎన్నో జీవులు, ప్రకృతి కనిపిస్తున్నాయి. మనకున్న జ్ఞానంతో మనం ఎంతవరకు బ్రతకవచ్చు ? ఒకరి ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఎంతవరకు అంగీకరించవచ్చు? పెద్ద విశ్వంలో ఒక చిన్న మూలన మనం ఉన్నాం. మరి ఇంత విశ్వం ఏర్పడటానికి కారణం ఏదైనా ఉందా? మనం చూస్తున్న ఇన్నింటికి మనకు మధ్య సంబంధం ఏమిటి? మన లక్ష్యం ఏమిటి ? అందుకు మన ఆచరణ ఎట్లా ఉండాలి ?
ప్రమాణం అనేది ఏదైనా ఉందా ? ప్రమాణాలని ఎంతవరకు వాడుకోగలం ?
ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు. అందరి ద్వారా ప్రేమించబడాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. సంతోషమైన జీవనం ఎలా సాధ్యం? మనం అన్నప్పుడు నేను అనేది ఎవరు ? కేవలం శరీరమా, శరీరానికి వెనకాతల మరేదైనా ఉందా ? కేవలం శరీరమే అనుకుంటే మరి ముసలితనం తప్పడంలేదు ఎవ్వరికీ. అది శాశ్వతం కాదు, ఆతరువాత ఏమిటి పరిస్థితి తెలియడం లేదు. అప్పుడూ శరీరంలోని అన్ని అంగాలు ఉన్నా పనిచేయడం లేదు ఎందుకు. శరీరానికి వెనకాత ఒక ఆత్మ అనేది ఉంది అనేది గమనించాలి. బాల్యం నుంచి ముసలితనం వరకు శరీరం ఎంతో మార్పు చెందుతుంది, కానీ నేను మనం అని చెప్పే ఆత్మ మాత్రం అట్లానే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించడం అవసరమా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.
మనిషి జ్ఞానం కలవాడు. తెలుసుకోవడం మన స్వరూపం. కొందరు సంపదలు పెంచుకోవాలని అనుకుంటారు. కొందరు శరీరాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. కానీ ఆత్మ అనేది కేవలం జ్ఞానాన్నే స్వరూపంగా కలది. సరియైన జ్ఞానాన్ని పెంపొందిచ్చుకున్నప్పుడే ఆత్మకు ఉజ్జీవనం అవుతుంది. వాస్తవాన్ని తెలుసుకోవాలి అనే కోరిక అందరికీ ఉంటుంది. వాస్తవాన్ని దర్శించాలి అని చేసే ప్రయత్నంలో మనం ఏదో ఒక ప్రమాణాన్ని తీసుకొని ముందుకు నడవాలి. జ్ఞానాన్ని పొందడానికి మూడు మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం. అవి.
1. ప్రత్యక్షం
2. అనుమానం
3. ఆప్తవాక్యం (లేదా శబ్దం లేదా వేదం)మనకు ఎదుట కనిపించే వాటితో మొదలుకొని కనిపించని దాని వైపు అన్వేషణ సాగించడమే మనం చేయగలిగేది.

'ప్రత్యక్షం' ఎంత వరకు ప్రమాణం ?

వాస్తవాన్ని గుర్తించేందుకు మనం చేసే అన్వేషణకు ఒక ప్రమాణం ప్రత్యక్షం.
కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొందడం. మనం జ్ఞానేంద్రియాల ద్వారా మనం విషయాలని గుర్తిస్తాం. జ్ఞానేంద్రియాలను సంస్కృతంలో అక్ష అని అంటారు, మనకు జ్ఞానాన్ని ప్రసరింపజేసే జ్ఞానేంద్రియాలను ప్రత్యక్షం అని అంటారు. లేక ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందినదాన్ని కూడా ప్రత్యక్షం అని అంటారు. కంటికి కనిపించేదాన్నే ప్రత్యక్షం అని అర్థం కాదు. కొందరు కంటితో చూస్తేనే నమ్ముతాం అని అంటుంటారు. ఒక పుష్పానికి వాసన ఉంటుంది, దాన్ని కంటితో చూడగలమా ? ఏదో ఒక జ్ఞానేంద్రియానికి అందాలి తప్ప, కంటితోనే  చూడలని అనుకోం. జ్ఞానేంద్రియాల ద్వారా మనకు ఎదురుగా కనిపించిన దృశ్యం, వాసన మొదలైనవన్నింటినీ ప్రత్యక్షం అని అంటారు. ఉదాహరణకి యుద్దం చేసే వాడిని యోధ అని అంటారు. యుద్దాన్ని ఎవరితోనైతే చేస్తాడో వాడిని ప్రతియోధ అని అంటారు. అట్లానే జ్ఞానేంద్రియాలకు అభిముఖంగా ఉన్న వస్తువులు, వాసనలు, శబ్దాలు మొదలైన వాటిని కూడా ప్రత్యక్షం అని అంటారు. అంతే కాదు, మనం ఒక వస్తువును చూస్తున్నాం అంటే అది కంటికి ఆ వస్తువుకి మధ్య ఒక ప్రక్రియ జరుగుతుంది, మన జ్ఞానం ఆ వస్తువుదాకా వెళ్ళి దాని ఆకారాన్ని గుర్తించి తిరిగి మనవరకు తీసుకొస్తుంది. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియను కూడా ప్రత్యక్షం అని అంటారు. మనం ఒకరి ద్వారా సమాచారాన్ని ఎవరివరకైనా పంపితే వారిని ప్రతినిధి అని అంటాం, అట్లానే మన జ్ఞానేంద్రియాల వరకు జ్ఞానాన్ని అందించే ప్రక్రియను ప్రత్యక్షం అని అంటారు.
అయితే ఈ పద్దతిలో మనం కేవలం జ్ఞానేంద్రియాలని వాడుతాం. కేవలం జ్ఞానేంద్రియాల ద్వారా మనం మొత్తం జ్ఞానాన్ని పొందగలమా అనేది ప్రశ్నాత్మకం. అందులో కూడా లోపం ఉంది అనేది వాస్తవం. ఒక తాడును చూసి మనం పాము అను అనుకోవచ్చు. ఒక బొమ్మను చూసి మనిషేమో అని అనుకోవచ్చు. మనం ఒక సినిమా చూస్తాం. తెరపై దృశ్యం నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. కానీ వెనకాతల ఒక్కో దృశ్యాన్ని కల్గిన రీలును అతివేగంగా తిప్పుతుంటారు. అది తిరిగే వేగం మన కంటికి అందనంతలా ఉంటుంది కాబట్టి మనకు నిరంతరం కదులుతున్నట్టే కనిపిస్తుంది. అంటే మనకంటికి లోపం ఉన్నటే తెలుస్తుంది. అంతే కాదు శబ్దాన్ని గ్రహించే చెవులు అన్నింటిని గ్రహించలేవు. ఒక నాడు 10 పాటలు కల్గి ఉంటే సి.డి లో 100 పాటలు చేర్చుతున్నారు. ఎందుకంటే మనకు వినిపించని ఎన్నో స్వరాలని తీసివేసి ఆపాట మనకు ఎంతవినిపిస్తుందో అంతకు తగ్గిస్తున్నారు కనక ఎక్కువ పాటలని ఒక సి.డిలో వ్రాయగల్గుతున్నారు. అంటే మన చెవులకి లోపం ఉంది అని తెలిస్తుంది. జ్ఞానేంద్రియాలకు లోపం ఉంది అనే విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా తెలుపుతుంది అనేది స్పష్టం అవుతుంది.
కంటికి కనిపించడంలేదని మనం భగవంతుడు లేడు అని చెప్పడంలేదు,  భగవంతుణ్ణి గుర్తించవల్సింది మనస్సుతో. అందుకే మనం మనస్సును శుద్ది చేసుకోవాలి. అప్పుడు మనం భగవంతుడిని స్పష్టంగా దర్శించగలం. మన కంటికి కనిపించేందుకు భగవంతుడు స్వీకరించిన రూపమే విగ్రహం. అయితే అది ఒక అచేతన వస్తువుగా కనిపించవచ్చు, స్పష్టంగా దర్శించాలి అంటే మనం కొంత సాధన చేయవలసి ఉంటుంది.

'అనుమానం' ఎంతవరకు ప్రమాణం ?

 వాస్తవాన్ని గుర్తించేందుకు మనం చేసే అన్వేషణలో మరొక ప్రమాణం అనుమానం.
 అనుమానం - మానం అంటే కొలిచే పద్దతి. కాలానికి కొలమానం అంటే సమయాన్ని కొలవడం అని అర్థం. మన ఎదురుగా కనిపించే వాటి ద్వారా విషయాలని దర్శిస్తాం. మనకు కనిపించేదాన్ని బట్టి కొంత ఊహించగలం. అట్లా వాస్తవాన్ని దర్శించే పద్దతిని 'అనుమానం' అని అంటారు.   ప్రత్యక్షంగా చేసిన పర్యవేక్షణలో పొందిన జ్ఞానం ద్వారా కొంత ఊహిస్తాం. అట్లా మనం ఊహించి కొంత విషయాన్ని గుర్తించవచ్చు.
ఒక శబ్దాన్ని విని, అక్కడ ఒకరు ఉన్నారు అని గుర్తిస్తాం. అయితే ఊహకు ఆధారం ప్రత్యక్షం. అంతే కాదు కల అనేది సత్యమా ? కాదా ?. సత్యం అంటే 'సత్'- ఏదో ఒక ప్రమాణానికి అందేది అని అర్థం. అయితే కల కూడా మనకు చెడో, మంచో ఏదో ఒక అనుభవాన్ని ఇస్తుంది, అంటే అది ఒక ప్రమాణానికి అందినట్లే కదా. ఎప్పుడో మనం ప్రత్యక్షంగా గ్రహించిన జ్ఞానాన్ని మన మనస్సు లోన దాచుకొని ఉంటుంది, ఎప్పుడో ఒక నాడు అవే విషయాలు కొంత మార్పుతో స్వప్నంలో కనిపించి ఒక అనుభవాన్ని కలిగిస్తాయి.
మన ఇతిహాసాలు, పురాణాలు మనకు ఎన్నో విషయాలను తెలుపుతున్నాయి. అవన్నీ ఊహించి వ్రాసినవి అని కొందరు కొట్టి పాడేస్తుంటారు. అయితే ఒక విషయం గమనించాలి. ఊహ అనేది జరగాలంటే దానికి ప్రత్యక్షం అనేది తప్పని సరిగా ఉండి తీరాలి. ఆ విషయం సరియైనదో కాదో తరువాత విశ్లేషించుకోవచ్చు, కానీ నేరుగా కొట్టివేయడం అనేది సరియైన పద్దతి కాదు.
అయిటే మన ఊహ అన్ని చోట్లా సరియైన జ్ఞానాన్ని కలిగిస్తుంది అని చెప్పలేం. అప్పుడప్పుడు తప్పు జరగ వచ్చు. మనం ఎన్నింటినో ఊహిస్తాం, ఒక కొండ వద్ద పొగ కనిపిస్తే అక్కడ నిప్పు ఉందేమో అని ఊహిస్తాం. కానీ అది పొగ మంచు అయి కూడా ఉండవచ్చు. మన ఇంటి ముందు వర్షం పడుతున్నంత మాత్రాన ఊరు మొత్తం వర్షం పడుతుంది అని చెప్పలేం, కొన్ని ప్రాంతాలలో వర్షం లేక పోయి ఉండవచ్చు. 
వాస్తవాన్ని దర్శించేందుకు అనుమానం అనే ప్రమాణం కూడా అన్ని చోట్లా సరియైనది కదు అని స్పష్టం అవుతుంది. ఇందులో కూడా లోపం ఉంది అనేది మనం గమనించాలి.

ఆప్తవాక్యం లేక వేదం - లోపం లేని ప్రమాణం 

మనం జ్ఞానాన్ని నేరుగా అంటే ప్రత్యక్షంగా కాక, ఊహించక మరొక పద్దతి ద్వారా గుర్తిస్తాం, దాన్నే ఆప్తవాక్యం అని అంటారు. ఆప్త వాక్యం అంటే మన అప్తుల ద్వారా అందే విషయం. ఆప్తులు అంటే ఎట్లాంటి స్వార్థం లేక మన మంచి కోరి చెప్పే వారు. మనం నేరుగా గుర్తించాల్సిన పని లేదు, ఊహించాల్సిన పనిలేదు, కానీ కొందరు చెప్పిన విషయాలను మనం నమ్ముతాం. వారు చెప్పిన మాటలనే ఆప్త వాక్యం అని అంటారు. మన పూర్వులు మనకు చెబుతారు, వారికి వారి పూర్వులు చెప్పారు, వారికి వారి ముందు వారు, ఇలా మన భారత జాతి కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి జ్ఞాన సంపదను మనవరకూ తెచ్చి అందిస్తోంది. మనం కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేకుండా అనుభవించే పిత్రార్జిత ధనం లాంటిది.

ఆప్తవాక్యాన్ని ఎట్లా నమ్మగలం ?

దీనికే మరొక పేరు 'శబ్దం'. శబ్దం అంటే సహజమైనది అయ్యి ఉండవచ్చు లేక కృత్రిమమైనది అయ్యి ఉండవచ్చు. కృత్రిమమైన శబ్దాలు మారుతూ ఉంటాయి. మనం తయారు చేసుకున్న భాషలు అన్నీ కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మనం వాడే భాషల్లో కొన్ని పదాల అర్థాలు మనం ఏర్పాటు చేసుకున్నవి కనక అవి మనం మారిస్తే అవి మారుతూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష ఉండవచ్చు. ఈ భాషలన్నీ మనం తయారుచేసుకున్నవి. మనం తయారు చేయని కొన్ని సహజమైన శబ్దాలు ఉంటాయి, అవి ఎప్పటీకీ ఒకేలా ఉంటాయి. ప్రకృతిలో మనకు వినిపించే గాలి యొక్క శబ్దం, సాగరం యొక్క శబ్దం ఎప్పటికీ ఒకేలా ఉంటాయి. అయితే ఈ సహజ శబ్దాలలో కొన్ని అర్థం కలిగిన శబ్దాలు ఉన్నాయి వాటినే వేదం అని అంటారు. అవి ఎవరో తయారుచేసినవి కావు.
ప్రత్యక్షం, అనుమానం అనే ప్రమాణాలతో వాస్తవాన్ని గుర్తించడం అనేది కష్టం. తప్పులు జరిగే అవకాశం ఎంతో ఉంది. ఇలా మన పూర్వులు ఈ విషయాన్ని గమనించి, కేవలం భాహ్యమైన వాటితో గుర్తించడం సాధ్యం కాదు అని గమనించి, వారు తమ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి లోనివైపు కేంద్రీకరించడం ప్రారంభించారు. అట్లా ఎంతోకాలంగా చేసిన ప్రయత్నానికి వారు ఎట్లాంటి లోపాలు లేని ప్రమాణంగా వేద శబ్దాన్ని గుర్తించారు. వేద శబ్దం 'అపౌరుషేయం'. ఎవరో ఒకరు చెప్పినదో వ్రాసినదో కాదు. వేద శబ్దం అనేవి ప్రకృతిలో ఉండే సహజమైన శబ్దాలు. ఊహకు అందని సృష్టి రహస్యాలు మనకు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. వేదాన్ని మనం లోపం లేని ప్రమాణం గా గుర్తిస్తాం.

అట్లా ప్రత్యక్ష్యం, అనుమానం మరియూ శబ్దం(లేక ఆప్తవాక్యం లేక వేదం) అనే ఈ మూడింటిని మనం ప్రమాణాలుగా తీసుకుంటాం. ఈ మూడు ఎట్లా వాడుకోవాలో తెలిపేవారే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అయితే ప్రత్యక్షం, అనుమానం లాంటి ప్రమాణాలలో ఎంతవరకు వీలు అవుతుందో అంతా అంగీకరిస్తాం. వేద మార్గాన్ని పూర్తిగా విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైధికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైధికమో ఏది అవైధికమో తెలిపాయి. అట్లాంటి వాటిని ఆధారంగా తీసుకొని వాస్తవ సందర్శన చేస్తాం.
 
 మనం తయారుచేసిన వాటిలో లోపం ఉండే అవకాశం ఉంది. ఒక వస్తువుని చూసి మరొకటి అని అనిపించే అవకాశం ఉంది, దీన్నే బ్రాంతి అని అంటారు. అట్లా బ్రాంతితో చెప్పేవాటిలో లోపం ఉంటుంది. మరొక కారణం, ఉన్నదాన్ని స్పష్టంగా చూడలేక పోతాం, దీనికి పరాక్కు లేదా ప్రమాదం అని అంటారు. మూడోది విప్రలిప్స, ఎదుటివారిని సంతోషపెట్టేందుకు కల్పించి చెప్పేవి. మన పురాణాల్లో కూడా ఈ దోషాలు ఉన్నాయి. ఏదో ఒక వ్యక్తి సంతోషపడుతాడని వ్రాసినవీ ఉన్నాయి. అట్లాంటివి మనకు ప్రమాణాలు కావు. నాలుగోది, మనలో అశక్తి, కొన్నింటిని మనం అనుభవిస్తుంటాం కానీ వ్యక్తపరచలేం. ఎన్నో అనుభవాలని మాటలో తెలుపలేం. అన్నింటిని తెలుపగలిగే వాంఙ్మయం అనేది లేదు. మనం వ్యక్తం చేసే వైధికమైన శబ్దాలు కూడా వాంగ్మయ రూపంలోనే ఉండడంచేత,  వాంఙ్మయ రూపంలో ఉన్న వేదం కూడా భగవత్ ఆనందం ఎట్లా ఉంటుంది అంటే చెప్పడం నాకూ చేతకాదు అని ఒప్పుకుంది. "ఎతో వాచో నివర్తంతే అప్రా ప్యమనసాసహ ఆనందం బ్రహ్మణో విద్వాన్" అంటుంది తైత్తిరీయం అనే వేద శాఖ. కొంత వరకు చెప్పగలను, కొంత ఊహించుకొనేంతవరకు కల్పన చేసి చెప్పగలను, కానీ పూర్తిగా చెప్పడం నాకూ చేతకాదు అంటుంది. భ్రమ, ప్రమాదం, విప్రలిప్స, అశక్తి అనేది జీవ నిర్మితములైన వాటికి ఉంటాయి కానీ వేదానికి అట్లాంటి దోషాలు ఉండవు. దీన్నే శాస్త్రం అని అంటాం. అంటే మనల్ని శాసించగలదు అని అర్థం. మనం ఇది చేయవచ్చు, ఇది చేయ కూడదు అని కృత్యాకృత్యములని, ఉన్న వస్తువులేమి, లేని వేమి అని నిరూపించ సామర్థ్యం కలది శాస్త్రం. శాస్త్రం అంటే మనకు కనిపించే సామాన్య శాస్త్రం, వాస్తుశాస్త్రం, రసాయణ శాస్త్రం ఇలాంటివి కాదు. శాస్త్రం అన్నాం అంటే అది వేదం అని అర్థం

(ఇంకా ఉంది...)