Wednesday, November 16, 2016

సనాతన వైదిక ధర్మం - 7

వేదవ్యాసుడు ప్రతిపాదించిన 'బ్రహ్మ సూత్రాలు'


వేదాన్ని వివరంగా తెలిపే గ్రంథాలను అంగీకరించేప్పుడు వేదానికి విరుద్దంగా లేని వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. కపిలుడు, బుద్దుడు భగవంతుని అవతారాలైనప్పటికీ వారు చెప్పినవి ప్రామాణికం కాదు. కపిలుడు చెప్పిన విషయాలు కేవలం ప్రకృతి గురించి మాత్రమే, బుద్దుడు చెప్పిన విషయాలు ఊహ లేక అనుమానం వరకే అందుతాయి. అవి ఆయా కాల పరిస్థితులను బట్టి చెప్పినవే కానీ, వాస్తవాలు కావు. వేదాన్ని ఆచరించేవారు వాటిని ఖండిస్తారు.

వేదాల విషయానికి వస్తే ప్రతి వేదంలో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి. అవి సంహితలు, బ్రాహ్మణాలు మరియూ ఆరణ్యకాలు. ఆరణ్యకాలలో ఉపనిషత్తులు ఉంటాయి. వేద వ్యాసుడు మహాభారతాన్ని వ్రాసే సమయంలో ఎందరో ఋషుల మధ్య ఎన్నో సందేహాలు ఉండేవి. ఒక్కో ఉపనిషత్ కొన్ని విషయాలను తెలుపుతాయి కనుక. వారు ఒకచోట కలిసినప్పుడు చర్చించేవారు. అయితే ఎవరి అభిప్రాయాలు వారికి ఉండేవి. వారి అందరి కోరిక కేవలం వాస్తవాన్ని శోదించడం, తరువాత తరాల వారు బాగుపడటానికి విలువైన విషయాలను అందించడం. అందుకే వారిని గొప్ప శాస్త్రజ్ఞులు అని అంటారు. వారికి ఉన్న శ్రద్ద అట్లాంటిది. ఇంద్రుడు కూడా ప్రజాపతుల ఆశ్రమాలలో ఎనూట ఇరవై సంవత్సరాలు గడిపాడు అని తెలుస్తుంది. ఎవరికి తోచినట్లు వారు చెప్పడం కాక, వారి చర్చలు వేదాలను అనుసరించి ప్రామాణికంగా ఉండేవి.

అట్లా వారికి ఏర్పడ్డ సందేహాలను, భిన్న భిన్న అభిప్రాయాలను తొలగించేందుకు వేదవ్యాసుడు లోకంలో అన్ని చోట్ల నుండి ఋషులని పిలిపించి పెద్ద సత్రాన్ని ఏర్పాటుచేసాడు. ఒక పెద్ద యాగం జరిగింది. దానికే 'సత్రయాగం' అని పేరు. కొన్ని సంవత్సరాలు జరిగింది ఆ యాగం. ఆరాధన చేయగానే అందరూ చర్చ జరిపేవారు. అందులో ఒక్కొక్కరు వారికి అర్థం అయ్యింది తెలిపేవారు. దాన్ని తీసుకొని అందరూ తమ తమ అభిప్రాయాన్ని ప్రామాణికంగా తెలిపేవారు. అందరూ కలిసి ఒక సారాంశాన్ని తేల్చేవారు. అది వేదానికి అనుగుణంగా ఉండేది, అందరి సంశయాలని తొలగించేది. ఆరణ్యకాలలోని ఉపనిషత్తుల సారంగా, ఆ సత్రయాగం జరిగిన సమయంలో ప్రతిపాదించబడ్డ విషయాలనన్నింటినీ వేదవ్యాసుడు ఒక సారాంశంగా వ్రాసాడు. వాటినే బ్రహ్మ సూత్రాలు అని అంటారు. అందులో 545 సూత్రాలు ఉంటాయి. అందులో ఆత్మ యొక్క గతి, దాని ప్రయాణం ఎట్లా సాగుతుంది, మానవ జన్మకి ఎట్లా వస్తుంది, లేక మరొక జన్మకి ఎట్లా వెళ్తుంది, మనిషి బ్రతకడానికి అవసరమైన విధులు అన్నీ ఉంటాయి. మనిషి యొక్క శారీరక విధులైన దంతదావన-దంతాలు శుభ్రపరచుకోవడం, జిహ్వాలేకనం -నాలుక శుభ్రపరచుకోవడం, గండూషణం - నోరు పుక్కిలించడం, స్నానం ఆచరించడం, దైవారాధన, అల్పాహారం తీసుకోవడం ఇలామనం లేచిన సమయం మొదలుకొని తిరిగి రాత్రి విశ్రాంతి తీసుకొనేంత వరకు మనం చేయాల్సిన ప్రతి ఒక్కటీ ఎట్లా క్రమంగా చేయాలో తెలుపుతాయి. దీన్నే సామాన్య శాస్త్రం అని అంటారు. 



మహాభారతంలోని భగవద్గీత, వేదాలలోని ఉపనిషత్తులు మరియూ బ్రహ్మ సూత్రాలు, ఈ మూడింటి ఆధారంగానే మన ఆచార్యులు సంప్రదాయాలను లేక సిద్దంతాలను స్థాపించడం జరిగింది. ఈ మధ్య కాలంలో వైదిక సంప్రదాయాలు ఇట్లా ఏర్పడ్డవి అనేది గుర్తించాలి. 

1 comment:

  1. బావుంది. బ్రహ్మ సూత్రాలు PDF తెలుగు లో ఉంటే పంపగలరు.

    ReplyDelete