Sunday, June 17, 2012

సనాతన వైదిక ధర్మం‎

వేదం తెలిపేది ధర్మాన్ని

వేదాలు చెప్పేవి ముఖ్యంగా ధర్మం గురించే. శాస్త్రాలు ఎక్కడా ధర్మాన్ని వదిలేయమని చెప్పవు. ఇది గుర్తుకు పెట్టుకోవాలి. మనం కర్మ ఆచరణను ఎట్లా చేయాలో తెలుపుతాయి, కానీ మన కర్మని వదిలివేయడం అనేది ఉండదు. ధర్మం అనగానే ఇది ఒక మతపరమైనది అని భావన. కానీ అది తప్పు. జీవితం వేరు, మతం వేరు కాదు. ధర్మం అనేది మనం ఆచరించేది, ఒక్కోసారి మనం చేసేది వృదా అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది కానీ అది ఒకనాడు మన కష్టకాలంలో కాపాడుతుంది. మనం ధనాన్ని దాచుకుంటే అది వడ్డీతో పాటు మన అవసరానికి ఆదుకుంటుందే అట్లానే ధర్మం కూడా. అన్నింటికీ అర్థం తెలియనవసరం లేదు కానీ మనం ఆచరించాలి. అది కేవలం ఈ లోకం కోసమే కాదు పరలోకంలో కూడా మనల్ని రక్షించేది.
ధర్మం అంటే ఏమిటో ఆపదం ఏర్పడ్డ ధాతువుల నుంది తెలుస్తుంది. 'ద్రియతే ధారయతే ఇతి ధర్మః'. మనం మొదట ధర్మాన్ని ఆచరిస్తాం, ఆపై అది మనల్ని రక్షిస్తుంది. ధర్మం అంటే ఏమిటో మన ఋషులు అందమైన వివరణ ఇచ్చారు, 'ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః'. మనం అసలు కోరేది ఏమి అంటే అది ఆనందం. ఎక్కడ ? మనం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉండగా ఆనందంగా ఉండాలి. ఇక్కడి నుండి ఏలోకానికి వెళ్ళినా అక్కడా అనందంగా ఉండాలి. స్వర్గంలో ఉన్నవారు కూడా ఆనందంగా ఉండరట. అక్కడ ఉన్నప్పుడు అక్కడి సుఖాలకు అలవాటు పడి ఉంటారు. అది వదులుకోవాలని అనిపించదు వారికి. అక్కడ వారు కోరినవి అన్ని లభిస్తాయి, కానీ అక్కడ ఉండటం అనేది మన పుణ్యం ఉన్నంత వరకే. అది ఖర్చు అయ్యాక తిరిగి ఇక్కడికి రావల్సిందే. అక్కడ మనం అనుభవించడం వరకే మనం చేయగలిగేది కానీ పుణ్యాన్ని అంటూ సంపాదించే అవకాశం ఉండదు. ఏది సంపాదించాలన్నా తిరిగి భూమిపై మాత్రమే సాధ్యము. వేదాన్ని అర్థం చేసుకొని బ్రతికేవారు ఎప్పుడూ స్వర్గాన్ని కోరరు. నేరుగా భగవంతుని వద్దకే వెళ్ళాలని కోరుకుంటారు, లేకుంటే ఇక్కడే ఉండాలి అని కోరుకుంటారు. పరమపదానికి వెళ్ళాలంటే భూమి నుండే వెళ్ళే అవకాశం ఉంది తప్ప స్వర్గాది లోకాలల నుండి కాదు. మనం ఒక్కటి చేసి అన్ని ఫలాలు అందించగలిగేది ధర్మం అంటే. అయితే స్వర్గాది లోకాలకు వెళ్ళాలన్నా, నిత్య నిలయమైన పరమపదానికి వెళ్ళాలన్నా మనం ధర్మాన్ని ఆచరించవలసిందే.
 మనం నివసిస్తున్న భూమి ఒక సౌరమండలంలో ఉంది. అట్లాంటి ఎన్నో గోళాలు కలిస్తే ఒక అండం అని అంటారు. అట్లాంటి అనంతమైన ఎన్నో అండాలు కలిస్తే ఒక బ్రహ్మాండం. అట్లాంటి అనంతమైన బ్రహ్మండాలు కలిపితే అది లీలా విభూతి అని అంటారు. పరమాత్మను అఖిలాండ కోటి బ్రహ్మాండాల నాయకుడు అని చెబుతారు. అయితే ఈ లోకాలన్నీ ఒక నాడు ఉంటాయి, ఒక నాడు ఉండవు సృష్టీ ప్రళయాలని బట్టి. భగవంతుడు ఏర్పర్చుకున్న కార్య వైకుంఠం నుంది సృష్టీ స్థితీ లయాలు జరుగుతాయి. వీటన్నింటికీ కారణమైన కారణ వైకుంఠం లేక పరమపదం విరజ అనే నది అవాల ఉంటుంది. అది ఎప్పటికీ ఉంటుంది. అందుకే నిత్యం అని వ్యవహరిస్తారు. దాన్నే నిత్య విభూతి అని అంటారు. విరజ క్రింద ఉన్నది లీలా విభూతి, విరజ పైన ఉన్నది నిత్య విభూతి. నిత్య విభూతి లీలా విభూతికి మూడు రెట్లు ఉంటుంది. అందుకే 'త్రిపాద్ నిభూతి' అని చెబుతారు. లీలా విభూతికి ఎంత క్రిందకు వెళ్ళినా అంతం ఉండదు. నిత్య విభూతికి పైన అంతం ఉండదు. అందుకే పరమాత్మకి ఉభయ విభూతి నాయకుడు అని పేరు. విభూతి అంటే సంపద అని అర్థం.


ధర్మం అంటే ఏమిటో మన వేదాలు చెబుతున్నాయి. అవి మనకు అన్నిలోకాలలో మనకు సుఖాన్ని ఇస్తాయి. "ఎతో అభ్యుదయ నిశ్శ్రేయస సిద్దిః స ధర్మః"
ఎతః - ఏది ఆచరిస్తే
అభ్యుదయ - విరజ ఈవల ఉన్న లీలా విభూతిలో ఉన్నతి
నిశ్శ్రేయస - విరజ ఆవల ఉన్ననిత్య విభూతిలో ఉన్నతి
సిద్దిః - లభిస్తుంది.
సహ - అట్లా లభింపజేసే ఆచరణ లేక సాదనమును 
ధర్మః - ధర్మం అని అంటారు.
ధర్మం అనేది చెప్పేది కాదు. అందరూ తప్పక ఆచరించాల్సింది. ఎందుకు తప్పని సరిగా ఆచరించాలి. మనంతట మనం ఒకరికి హాని చేయక  మన దారిన మనం బ్రతకుతున్న వారు కూడా ధర్మాన్ని ఆచరించాలా, అలా బ్రతికితే చాలదా ? అనేది కొందరి ప్రశ్న. అది సరియైనదే, కానీ మనం పొందాల్సిన అసలు ఫలం కూడా ముఖ్యమే కదా. అది కూడా ఆలోచించుకోని బ్రతకాలి. అయితే మనిషి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈర్ష, అసూయ, ద్వేషం వంటివి మనం ఎంత కాదన్నా తప్పక కలుగుతుంటాయి. ఒక చెట్టు తాను ఏమి ఆశించక లోకానికి ఎంత ఉపకారం చేస్తుంది. మనం కనీసం ఒక చెట్టు చేస్తున్న ఉపకారం అయినా చేస్తున్నామా. అట్లా చూస్తే మనిషి చెట్టుకంటే ఎంతో చేయగలడు, అట్లా చేయక ప్రకృతిలోని ఎన్నింటినో మనం వాడుకుంటున్నాం, అప్పుడు మనం ప్రకృతిని దొంగలించినట్లే కదా లెక్క. మనిషి యొక్క యోగ్యత చెట్టు కంటే చాలా గొప్పది. అది ఆలోచించి బ్రతకాల్సిన భాద్యత మనిషిది. అట్లా మనిషి ఆచరించాల్సినదే ధర్మం అంటే. ఆధర్మాన్నే మన ఋషులు ఆచరించి మన వరకూ అందించారు. ఎలా తెలియాలి ధర్మం అంటే 'వేదోఖిలో ధర్మ మూలం'. వేదంలోని ప్రతి అక్షరం ధర్మాన్ని చెప్పడానికే.
  
అయితే అన్ని వేదాలను కలిపి చూస్తే అవి మనం ఆచరించాల్సిన ధర్మం గురించి తెలుపుతాయి. ఎట్లా ఆచరించాలి ? అంటే క్రమశిక్షణ తో ఆచరించాలి. మనకు వెంటనే ఫలితం రాకుంటే ఏం చేయాలి ? ఆపకూడదు, మన కృషి చేస్తూనే ఉండాలి. ఫలితం వస్తుందా ? అంటే తప్పక వస్తుంది. మనం అలవర్చుకోవాల్సింది ఈ లోకంపై , పరలోకం పై నమ్మకం మరియూ మనపై, భగవంతునిపై విశ్వాసం. వేదాలు మన ఆచరణ ఎట్లా ఉండాలో తెలుపుతాయి, దాన్నే ధర్మం అని అంటారు.

2 comments:

  1. చాలా బాగా చెప్పారు శర్మ గారు ధర్మాన్ని గురించి.
    నమస్కారములతో
    మీ
    భాస్కరానందనాధ

    ReplyDelete
  2. Your Site is quite good and very informative... Kindly change the Colour of background. Its little bit clumsy...and annoying..

    I hope you can understand..

    Radha Lakshmi

    ReplyDelete